Minister Niranjan Reddy : సుప్రీంకోర్టు, ఎర్రకోటలకు డోమ్ లు ఉన్నాయ్, వాటినీ కూలుస్తారా?- బండి సంజయ్ పై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
Minister Niranjan Reddy : ప్రగతి భవన్ , కొత్త సచివాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పై డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Minister Niranjan Reddy : బీజేపీ అధికారంలోకి వస్తే కొత్త సచివాలయం డోమ్ లు కూలుస్తామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరాచకంగా, అనాగరికంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాటలకు కేంద్ర నాయకత్వం వద్ద సమాధానం లేదన్నారు. ప్రతిపక్ష నేతలకు గతం, వర్తమానం, భవిష్యత్తు మీద ఎలాంటి అవగాహన లేదన్నారు. బండి సంజయ్ సచివాలయం గుమ్మటాలు కూల్చాలని అంటున్నారని, డోమ్ లు ఇంజినీరింగ్ అద్భుతాలన్నారు. సుప్రీం కోర్టు, ఎర్రకోట, అనేక అసెంబ్లీలకు డోమ్ లు ఉన్నాయని గుర్తుచేశారు. బండి సంజయ్ ను అధ్యక్షుడిని ఎలా నియమించారో బీజేపీ అధిష్టానం ఆలోచించాలన్నారు. బీజేపీ ఈ విషయంలో సిగ్గు పడాలన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే వారు ఎంతటి వారైనా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రగతి భవన్ ను నక్సల్స్ తో పేల్చాలన్న రేవంత్ పై కూడా కేసు నమోదు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ అధిష్టానాలు ఈ పిచ్చి వ్యాఖ్యలపై స్పందించాలన్నారు.
సుమోటోగా కేసు నమోదు చేయాలి
"బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అరాచకంగా, అనాగరికంగా మాట్లాడుతున్నారు. సచివాలయం గుమ్మటాలు కూలుస్తామన్న బండి సంజయ్, ప్రగతిభవన్ ను నక్సల్స్ బాంబులతో పేల్చాలన్న రేవంత్ ల పిచ్చి వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాలు స్పందించాలి. రెండు పార్టీల అధ్యక్షులు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. ఆ పార్టీల హైకమాండ్ లు దీనికి సమాధానం చెప్పాలి. బండి సంజయ్, రేవంత్ రెడ్డిల మీద డీజీపీ సుమోటోగా కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే వారు ఎంతటి వారైనా పోలీసులు చర్యలు తీసుకోవాలి. వారికి గతం, వర్తమానం, భవిష్యత్తు మీద ఎలాంటి అవగాహన లేదు. బీజేపీ నేత సచివాలయం గుమ్మటాలు కూల్చాలని అంటున్నారు. గుమ్మటాలు అనేవి ఇంజినీరింగ్ అద్భుతాలు, గుమ్మటం అనేది ఒక ఆకృతి. సుప్రీంకోర్టుకు కూడా డోమ్ ఉంది. ఎర్ర కోటకు కూడా డోమ్ ఉంది. అనేక శాసనసభ భవనాలకు డోమ్ లు ఉన్నాయి. వాటిని కూడా కూలుస్తారా? బండి సంజయ్ లాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఎలా నియమించారో బీజేపీ అధిష్టానం ఆలోచించాలి. బండి సంజయ్ అజ్ఞానానికి సిగ్గుపడాలి. స్వచ్ఛత గురించి మాట్లాడే ప్రధాని దీని గురించి మాట్లాడి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఉన్మాదమైన మాటలను సమాజం హర్షించదు. అద్భుతమైన పాలన అందిస్తున్న కేసీఆర్ ను తూలనాడడంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుపడాలి." - మంత్రి నిరంజన్ రెడ్డి
బండి సంజయ్ వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో తెలంగాణ కొత్త సచివాలయ భవన నిర్మాణ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన విమర్శలు చేశారు. సచివాలయ నిర్మాణం భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా లేదని అన్నారు. సచివాలయంలో మళ్లీ మార్పులు చేస్తామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయ డోమ్‌లు (గుమ్మటాలను) కూల్చేస్తామని చెప్పారు. సచివాలయం తాజ్ మహాల్‌ను స్ఫూర్తిగా తీసుకొని నిర్మించినట్లుగా ఉందని చెప్పారు. తాజ్ మహాల్ ఒక సహాధి అని, సమాధి తరహాలో సచివాలయం నిర్మించడం ఏంటని దుయ్యబట్టారు.