Minister KTR : హైదరాబాద్ లో ఫెడెక్స్, బోయింగ్ పెట్టుబడులు- మంత్రి కేటీఆర్ హర్షం
Minister KTR : హైదరాబాద్ లో మరో రెండు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ పెట్టుబడులపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Minister KTR : హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. అమెరికాకు చెందిన ఫెడెక్స్, బోయింగ్ సంస్థలు తమ కంపెనీలను భాగ్యనగరంలో నెలకొల్పనున్నాయి. ఈ సంస్థలు పెట్టుబడులు పెడతామని ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Two Big American enterprises @FedEx and @Boeing choose Hyderabad for their investments 😊#HappeningHyderabad pic.twitter.com/o6HRCKej3G
— KTR (@KTRBRS) March 10, 2023
ఫెడెక్స్ ఏసీసీ సెంటర్
అమెరికాకు చెందిన సరుకు సేవల సంస్థ ఫెడెక్స్ భారత్ లో తొలి అడ్వాన్స్ కెపాబిలిటీ కమ్యూనిటీ(ACC) సెంటర్‌ను హైదరాబాద్‌లో పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరిలోగా ఏసీసీ సెంటర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ సెంటర్‌తో భారత్‌లో తన కంపెనీ కార్యకలాపాలు మరింత వేగవంతం చేయడానికి దోహదం అవుతుందని ఫెడెక్స్ పేర్కొంది. వ్యాపార వర్గాలకు మరింత వేగవంతంగా సరుకు రవాణా చేయడానికి అవసరమైన టెక్నాలజీ, ఇన్నోవేషన్ల పరంగా ఈ సెంటర్ కీలకమైందని ఫెడెక్స్ వర్గాలు తెలిపాయి. వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఏసీసీ సెంటర్లను నెలకొల్పాలని ఫెడెక్స్ నిర్ణయించింది.
హైదరాబాద్ లో బోయింగ్
హైదరాబాద్ నగరం విమానయాన రంగంలోనూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే విమాన విడిభాగాలు, హెలికాప్టర్ బాడీ తయారీ సంస్థలు నగరంలో ఉన్నాయి. త్వరలోనే మరికొన్ని సంస్థలు హైదరాబాద్ లో రానున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ జీఎమ్మార్ ఏరో టెక్నిక్స్ తో ఒప్పందం చేసుకోబోతుంది. ఈ ఒప్పందంతో హైదరాబాద్‌లో ప్రయాణికుల విమానాలను సరుకు రవాణా విమానాలుగా మార్చే కార్యకలాపాలను బోయింగ్ ప్రారంభించనుంది. 737 బోయింగ్ ప్యాసింజర్ విమానాలను కార్గో విమానాలుగా మార్చే పనులు చేపట్టనుంది. ఇందుకోసం కన్వర్షన్ లైన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో ఒప్పందం కుదరనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లో బోయింగ్ సంస్థ పెట్టుబడులపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
ఫాక్స్ కాన్ పెట్టుబడులు
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ ను ఇటీవల కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఒక లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభించనుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో ఫాక్స్ కాన్ పెట్టుబడులపై మంత్రి కేటీర్ హర్షం వ్యక్తంచేశారు. లక్ష మందికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూ ప్రకటించారని కేటీఆర్ పేర్కొన్నారు.