Minister KTR : తెలంగాణపై వివక్షతో దేశప్రయోజనాలు తాకట్టు -మంత్రి కేటీఆర్
Minister KTR : బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపుల్లో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అన్ని అనుకూలతలు ఉన్న హైదరాబాద్ లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుచేయకపోవడం వివక్షే అని ఆరోపించారు.
Minister KTR : తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపుల్లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిందని విమర్శించారు. తెంలగాణపై వివక్షతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టుపెడుతోందన్నారు. కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటులో హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని గుర్తుచేశారు. భూసేకరణ, పర్యావరణ అనుమతులతో ఫార్మాసిటీ సిద్ధంగా ఉన్నా తెలంగాణపై వివక్ష చూపుతూ ఒక్క పార్క్ కూడా కేటాయించలేదని ఆరోపించారు. మాస్టర్ ప్లానింగ్‌తో ఉన్న ఫార్మాసిటీని కేంద్రం ఎందుకు విస్మరించిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి తెలంగాణకు బల్క్‌డ్రగ్ పార్క్ కేటాయించాలని మంత్రి కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు.
బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు మోడీ సర్కార్ మొండి చేయి : మంత్రి శ్రీ @KTRTRS.
— TRS Party (@trspartyonline) September 2, 2022
- తెలంగాణపై వివక్షతో దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం
- బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలం pic.twitter.com/oituuO0AQb
తెలంగాణపై వివక్ష
"బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు మోడీ సర్కార్ మొండి చేయి చూపింది. తెలంగాణపై వివక్షతో దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలం. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలంటే కనీసంగా మూడేళ్లు పడుతుంది. అన్నీ సిద్దంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని పరిగణలోకి తీసుకుపోకపోవడం, ఫార్మా రంగాన్ని అత్మనిర్భరత దిశగా స్వయం సంవృద్ధి చేయాలన్న లక్ష్యం పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతలేమికి ఇది నిదర్శనం. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్ తో సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని కావాలనే కేంద్రం విస్మరించింది. మారుతున్న ప్రపంచ రాజకీయాల తరుణంలో బల్క్ డ్రగ్ పార్క్ ల ఏర్పాటు అత్యవసరమన్న కేంద్రం మరో నాలుగేళ్లయినా పట్టాలెక్కని ప్రాంతాలకు వాటిని కేటాయించింది. అన్ని అనుకూలతలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీకి మొండి చేయి చూపడం ముమ్మాటికీ వివక్షే. వెంటనే తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలి " - మంత్రి కేటీఆర్
మూడు రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్కులు
బల్క్ డ్రగ్స్ తయారీకి తోడ్పాటు అందించేందగుకు కేంద్రం బల్క్ డ్రగ్ పార్క్ లను ఏర్పాటుచేస్తుంది. బల్క్ డ్రగ్ పార్క్స్ ప్రమోట్ పథకం కింద హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతిపాదనలకు ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్‌మెంట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ పార్క్ లకు ఆర్థిక వ్యయం కింద రూ. 3,000 కోట్లను 2020లో నోటిఫై చేశారు. మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్క్‌ల ఏర్పాటు కోసం ఆర్థిక సాయం అందించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా బల్క్ ఔషధాల తయారీ వ్యయాన్ని తగ్గించడం, దేశీయ పోటీతత్వాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం.
ఒక్కో పార్క్ కు రూ.1000 కోట్లు
ఈ పథకం కింద అభివృద్ధి చేయబోయే బల్క్ డ్రగ్ పార్కులు ఒకే చోట సాధారణ మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. తద్వారా దేశంలో బల్క్ డ్రగ్ తయారీకి బలమైన వ్యవస్థను సృష్టిస్తారు. తయారీ వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్ని్స్తారు. ఈ పథకం దేశీయంగా బల్క్ డ్రగ్స్ తయారీని ప్రోత్సహిస్తుంది. దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, గ్లోబల్ మార్కెట్‌లో ఆధిపత్యం సాధించడానికి వీటిని ఏర్పాటుచేస్తున్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్‌కు ఆర్థిక సహాయం కింద ఉమ్మడి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు వ్యయంలో 70% కేటాయిస్తారు. హిమాచల్ ప్రదేశ్ వంటి హిల్లీ స్టేట్స్ కు ఈ ప్రాజెక్ట్ వ్యయంలో 90% ఆర్థిక సహాయం కేంద్రం చేస్తుంది. ఒక బల్క్ డ్రగ్ పార్క్ కోసం పథకం కింద గరిష్టంగా రూ. 1000 కోట్లు అందిస్తుంది కేంద్రం.
Also Read : Telangana Assembly : కేబినెట్, టీఆర్ఎస్‌ఎల్పీ భేటీలే కాదు అసెంబ్లీ కూడా - కేసీఆర్ స్పీడ్ నిర్ణయాలు !
Also Read : కేంద్రం, తెలంగాణ ఎవరి అప్పులు ఎక్కువ ? నిర్మలా సీతారామన్ విమర్శలతో మరోసారి లోన్ల పంచాయతీ !