TS Loan Politics : కేంద్రం, తెలంగాణ ఎవరి అప్పులు ఎక్కువ ? నిర్మలా సీతారామన్ విమర్శలతో మరోసారి లోన్ల పంచాయతీ !
అప్పులు మీరంటే మీరే ఎక్కువ చేశారని అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు కేంద్రం విమర్శలు చేసుకుంటున్నాయి. నిర్మలా సీతారామన్ విమర్శలతో మరోసారి అప్పుల పంచాయతీ తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభమయింది.
TS Loan Politics : బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తరచూ ఏదో వివాదం రగులుతూనే ఉంటుంది. ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు..మరొకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఈ కారణంగా రెండు రాష్ట్రాల పాలనా వ్యవహారాలు కూడా రాజకీయం అవుతున్నాయి. తాజాగా తెలంగాణ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ కేసీఆర్ సర్కార్ చేస్తున్న అప్పులపై మండిపడ్డారు. పుట్టబోయే బిడ్డపైనా అప్పు ఉందన్నారు. అయితే తెలంగాణ చేస్తున్న అప్పులు తక్కువేనని.. టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. కేంద్రం చేస్తున్న అప్పులు ఎవరు కడతారని.. అది ప్రజల నెత్తి మీద అప్పు కాదా అని ప్రశ్నిస్తున్నారు.
పరిమితికి మించి తెలంగాణ అప్పులు చేసిందన్న నిర్మలా సీతారామన్ !
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అప్పులు FRBM పరిధి దాటి పోతోందని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల్లోకి నెట్టేశారని అన్నారు. రాష్ట్రంలో అప్పుడే పుట్టినబాబు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్ధితి వుందని కేంద్ర మంత్రి అన్నారు. ఉపాధి హామీ పథకం కోసం 20 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. కేంద్రం పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారని నిర్మల హెచ్చరించారు. ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుందని.. తానే ప్రధాని అన్నట్లు కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని నిర్మల మండిపడ్డారు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. దేశం మొత్తం తిరిగే ముందు తమ రాష్ట్రంలో జరుగుతున్న దానిపై సమాధానం చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.
అప్పులు పరిమితిలోనే ఉన్నాయని తెలంగాణ సర్కార్ వాదన !
తెలంగాణ అప్పులు.. పరిమితికి లోబడే ఉన్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిందని టీఆర్ఎస్ నేతలు రుజువులు చూపిస్తున్నారు. ఆర్బీఐ విడుదలచేసిన జూన్ నివేదికలో.. తెలంగాణ చేసిన అప్పు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడే ఉన్నట్టు వెల్లడించిందని చెబుతున్నారు. తెలంగాణ కన్నా దాదాపు 13 పెద్ద రాష్ర్టాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఎప్పుడో దాటేశాయని.. తెలిపింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ అప్పు 2019-20 నాటికి 23% మాత్రమే. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరాల అంచనాలు సైతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటలేదు. రాష్ర్టాల అప్పులు ఐదేండ్ల అనంతరం ఎలా ఉంటాయో ఆర్బీఐ అంచనావేసింది. దీని ప్రకారం తెలంగాణ అప్పు 13 పెద్ద రాష్ర్టాల కంటే తక్కువే ఉంటుందని పేర్కొన్నది. 2026-27 నాటికి తెలంగాణ అప్పు 29.8% ఉండవచ్చని తెలిపింది. ఈ విషయాన్నే టీఆర్ఎస్ నేతలు ఎత్తి చూపిస్తున్నారు.
మరి కేంద్రం చేస్తున్న అప్పుల సంగతేంటి ?
2021 డిసెంబర్ – 2022 మార్చి మధ్యకాలంలో భారత ప్రభుత్వం అప్పు 128.41 లక్షల కోట్ల నుంచి 133.22 లక్షల కోట్లకు పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రుణం జీడీపీలో 9 శాతానికి పైగా పెరిగింది. 2019-20లో జీడీపీలో ద్రవ్యలోటు జీడీపీలో 4.1% ఉండగా.. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అది జీడీపీలో 9.2 శాతం వద్ద నిలిచింది. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డపైనా రూ. లక్ష అప్పు ఉందని చెబుతున్న నిర్మలా సీతారామన్.. కేంద్రం చేస్తున్న అప్పుల భారం ఎవరిపై ఉందని తెలంగాణ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం చేస్తున్న అప్పులు కూడా దేశ ప్రజలే కట్టాలని.. ఈ లెక్కన ఒక్కొక్క పౌరుడిపై కేంద్రం భరించలేనంత అప్పు చేసిందనే విషయం తెలుస్తుందంటున్నారు.
మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం అప్పులు మీరు ఎక్కువ చేశారంటూ విమర్శించుకుంటున్నాయి. వాస్తవంగా రెండు ప్రభుత్వాల అప్పులూ మితిమీరిపోయాయన్న వాదన వినిపిస్తోంది.