KTR On Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కేటీఆర్ కౌంటర్, ఆ కర్మ పట్టలేదని ఘాటు వ్యాఖ్యలు
KTR On Bandi Sanjay : హైదరాబాద్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అందుకు సంబంధించిన కమిటీలను ఆయన ప్రకటించారు. బండి సంజయ్ పాదయాత్ర దాడిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
KTR On Bandi Sanjay : ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన టీఆర్ఎస్ ప్లీనరీ విజయవంతం చేసేందుకు కమిటీలు చేశారు. ప్రతినిధులు అంత పది గంటల కల్లా సమావేశ ప్రాంగణానికి చేరుకోవాలని కేటీఆర్ తెలిపారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పదకొండు గంటలకు సీఎం కేసీఆర్ ప్లీనరీకి చేరుకుని పార్టీ జెండా ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం తీర్మానాలు, వాటిపై చర్చలుంటాయని తెలిపారు. టీఆర్ఎస్ 21 ఏళ్లు పూర్తిచేసుకోవడం ఓ మైలు రాయి అని కేటీఆర్ తెలిపారు. ఈ నెల 27న 11 గంటల నుంచి అన్ని గ్రామాలు, బస్తీల్లో జెండా ఆవిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు.
కమిటీలు
- రంగారెడ్డి జిల్లా నేతల ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ
- మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో అలంకరణ కమిటీ
- ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఆధ్వర్యంలో ప్రతినిధుల రిజిస్ట్రేషన్, వాలంటీర్లు వ్యవస్థ
- పార్కింగ్ కు సంబంధించి ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో కమిటీ
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో పుడ్ కమిటీ
- మధుసూదనాచారి, పార్టీ కృష్ణ మూర్తి, శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ
- గువ్వల బాలరాజు, బాల్క సుమన్, భాను ప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా కమిటీ
హైద్రాబాద్ నగరంలో అలంకరణ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. పోలీస్, జీహెచ్ఎంసీ సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్లీనరీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
బండి పాదయాత్రపై స్పందించిన కేటీఆర్
బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ ఒక్కసారి రాయచూర్ వెళ్లిచూడాలని సవాల్ విసిరారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయా లేదో కనుక్కోవాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో కాంట్రాక్టర్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. బండి పాదయాత్రను అడ్డుకునే కర్మ టీఆర్ఎస్ కు లేదన్నారు. ఏ ముఖం పెట్టుకొని పాలమూరులో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పాలమూరుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. దమ్ముంటే దేశమంతా ఉచిత విద్య, వైద్యం మోదీని ఇవ్వమనాలని సవాల్ చేసారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆసుపత్రులు రద్దు చేస్తే తాము మద్దతు ఇస్తామన్నారు. డొల్లమాటలు, సొల్లు పురాణం కట్టిపెట్టాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పొత్తుపై స్పందించిన కేటీఆర్.. మాణిక్యం ఠాగూర్ ను పొత్తు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు.