Minister Harish Rao : దేశ రాజకీయాల్లో మార్పునకు మునుగోడు ఫలితం నాంది - మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao : తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పక్షాన ఉందని మరోసారి రుజువైందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Minister Harish Rao : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ కుట్రలకు మధ్య జరిగిన పోరాటంలో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీ పక్షాన నిలిచినందుకు ధన్యవాదాలు అన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పక్షాన ఉందని మరోసారి రుజువైందన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యానికి మరోపేరు అని నిరూపించుకున్నారని స్పష్టం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి కర్రుకాల్చివాతపెట్టారన్నారు. ఇది ముమ్మాటికీ మునుగోడు ప్రజల గెలుపు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తున్న బీజేపీ, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను తన పార్టీలో చేర్చుకొని మునుగోడుపై ఉప ఎన్నికను రుద్దిందన్నారు. బీజేపీ అహంకారాన్ని మునుగోడు ప్రజలు అణచివేశారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశరాజకీయాల్లో గుణాత్మకమార్పుకు మునుగోడు ఫలితం నాందివాచకమన్నారు.
చైతన్యానికి మారుపేరైన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి,బీజేపీ కుట్రలకు మధ్య జరిగిన ధర్మ యుద్ధంలో,సీఎం కేసీఆర్ గారి వెంట నిలిచి, అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు పలికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు.
— Harish Rao Thanneeru (@trsharish) November 6, 2022
1/2 pic.twitter.com/5K4Sionb4L
తెలంగాణకు కావాల్సింది అభివృద్ధి-సంక్షేమం
"సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన సంపూర్ణ మద్ధతుకు ఈ విజయం నిదర్శనం. అధికారం, డబ్బులు, ప్రలోభాల కన్నా ప్రజాస్వామ్యం గొప్పదని మునుగోడు ప్రజలు రుజువు చేసిన వైనం చరిత్రాత్మకం. కాంట్రాక్టులు-కమిషన్లు కాదు. విషం- విద్వేషం కాదు. తెలంగాణకు కావాల్సింది అభివృద్ది-సంక్షేమం అని మునుగోడు ప్రజలు తేల్చి చెప్పారు. ఈ ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన నాయకత్వ స్ఫూర్తితో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా శ్రమించారు. మునుగోడు ఉపఎన్నికల్లో అన్ని వర్గాలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చిన తీరు, ఆయన నాయకత్వంపై చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు. సీపీఎం, సీపీఐ పార్టీలు మునుగోడులో ఇచ్చిన మద్ధతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ నాయకత్వం దేశానికి కొత్త దశ- దిశ అందిస్తుందని ఈ ఉపఎన్నిక ద్వారా ప్రజలు దేశానికి కొత్త సందేశం ఇచ్చారు. అందుకు వారికి మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను."- మంత్రి హరీశ్ రావు
గుజరాత్ గులాంలకు తెలంగాణ సలాం చేయదు
బీజేపీ పై బీఆర్ఎస్ తొలి విజయం సాధించిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల జైత్ర యాత్రకు ఓటు రూపంలో మద్దతు పలికిన మునుగోడు ప్రజలది విప్లాత్మకమైన నిర్ణయమన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయం అన్నారు. సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ అని మరోసారి రుజువైందన్నారు. టీఆరెఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో కారుదే జోరు అని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామ రక్ష అన్నారు. ప్రభుత్వాలను కూల దోసె కుట్రలు చేస్తున్న బీజేపీకి ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణలో కుట్రలు చెల్లవని బీజేపీకి ప్రజలు చెంప చెల్లుమనిపించారన్నారు. గుజరాత్ గులాంలకు తెలంగాణ సలాం చేయదని తేల్చి చెప్పిన విజయం అన్నారు.