'ప్రయాణికులు ముందే టికెట్ తీసుకోవాల్సిన పని లేదు' - హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్
Hyderabad News: భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ అందించింది. త్వరలో ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్ అమల్లోకి తీసుకురానుంది. దీని ప్రకారం ప్రయాణం తర్వాత ఛార్జీలు వసూలు చేస్తారు.
Hyderabad Metro Introduce Open Loop Ticketing System: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు నిజంగా ఇది గుడ్ న్యూస్. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఎల్అండ్‌టీ మెట్రో సరికొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చే విధంగా యోచిస్తోంది. విదేశాల్లో ఉన్నట్లుగా 'ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ (OTS)' విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీని ప్రకారం ప్రయాణికులు టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కేయవచ్చు. అనంతరం రైలు దిగాక ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ కొత్త విధానాన్ని ఈ ఏడాది ప్రవేశపెట్టాలని హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రస్తుతం ఎలా అంటే.?
హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం 'క్లోజ్డ్ లూప్ టికెటింగ్' విధానం అందుబాటులో ఉంది. దీని ప్రకారం ముందే టికెట్ తీసుకోవాలి. ఒక దగ్గరి నుంచి ఇంకో చోటుకు టికెట్ తీసుకున్న వారు మనసు మార్చుకుని మధ్యలో ఏదైనా స్టేషన్‌లో దిగుదామని అనుకున్నా వీలుకాదు. అందుకు ఆ టికెట్ అనుమతించరు. ఈ క్రమంలో స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి. అయితే, ఓటీఎస్‌తో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణించిన తర్వాత మాత్రమే టికెట్ ఛార్జీలు వసూలు చేస్తారు. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులువుగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం మెట్రో స్టేషన్లలో కౌంటర్ల ద్వారా సైతం సిబ్బంది టికెట్లు విక్రయిస్తున్నారు. అలాగే, స్మార్ట్ కార్డ్స్, వాట్సాప్, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ల వ్యవస్థల ద్వారా సైతం హైదరాబాద్ మెట్రోలో టికెట్స్ తీసుకోవచ్చు.
ఒకటే టికెట్
'ఓపెన్ లూప్ టికెటింగ్' వ్యవస్థ అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ ఇలా అన్నింటికీ ఒకటే కార్డుతో చెల్లింపులు చెయ్యొచ్చు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (NCMC) ద్వారా ఈ విధానం అమలు చేయాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మెట్రో స్టేషన్లలో ఎన్‌సీఎంసీకి సంబంధించి టికెట్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మన దేశంలో 2022లో హరియాణా బస్సుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రయాణికుడు బస్సు ఎక్కేటప్పుడు యంత్రం వద్ద కార్డును చూపించాలి. మళ్లీ దిగేటప్పుడు కార్డును చూపిస్తే జీపీఎస్ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని గుర్తించి ఛార్జీ వసూలు చేస్తారు.
విదేశాల్లో ఎప్పటి నుంచో..
'ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్' విదేశాల్లో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. 2012లోనే ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ ఈ విధానం ప్రవేశపెట్టింది. అక్కడ ఇది సక్రెస్ కావడంతో అన్ని దేశాలు ప్రజా రవాణా వ్యవస్థల్లో దీన్ని అమలు చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్ మెట్రో రైల్లోనూ ఈ విధానం తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.