Rain Alert: తెలంగాణకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఏపీలో పరిస్థితి ఏంటంటే?
Telangana News: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రం అవుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Rain Alert To Telangana Districts: తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాలుస్తోన్న క్రమంలో వాతావరణ శాఖ తాజాగా చల్లని కబురు అందించింది. తెలంగాణవ్యాప్తంగా శనివారం కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అటు, భాగ్యనగరంలోనూ ఉదయం నుంచి వర్షం కురవగా చల్లని వాతావరణంతో నగరవాసులు ఉపశమనం పొందారు. ఇక, రాబోయే 4 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకూ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
సోమవారం నుంచి మంగళవారం వరకూ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డిలో వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక మంగళవారం నుంచి బుధవారం వరకూ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. అటు, బుధవారం నుంచి గురువారం వరకూ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలో ఇదీ పరిస్థితి
ఏపీలో కొన్ని చోట్ల ఎండలు తీవ్రంగా ఉండగా.. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదివారం పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం జిల్లా తరిమెలలో 44.2, కడప జిల్లా బలపనూరులో 43.8, అనకాపల్లి జిల్లా రావికమతంలో 43.8, పల్నాడు జిల్లా రావిపాడులో 43.8, నెల్లూరు జిల్లా కసుమూరులో 43.7, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 43.6, విజయనగరం జిల్లా ధర్మవరంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 82 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో వర్షాలు
కాగా, రాబోయే 4 రోజులు ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమలోని పలు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆదివారం విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు పిడుగుల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు.