Hyderabad News : తల్లి ఐసీయూలో, బిడ్డ అపస్మారక స్థితిలో - హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం, 120 మందికి పైగా అస్వస్థత!
Hyderabad News : హైదరాబాద్ లో కలుషిత నీరు వందల మందిని ఆసుపత్రి పాలుచేసింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గంటగంటకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది.
Hyderabad News : హైదరాబాద్ నగరంలోని కలుషిత నీరు కలకలం రేపుతోంది. మాదాపూర్‌లో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరుకున్నారు. మాదాపూర్ గుట్టబేగంపేట్ వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి 120 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని కొండాపూర్ ఆసుపత్రికి తరలించారు. కలుషిత నీరు తాగిన కాలనీ వాసులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. అయితే బాధితులకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని వైద్యులు తెలిపారు. వడ్డెర బస్తీలో ఓ వ్యక్తి వాంతులు విరేచనాలతో గురువారం రాత్రి మృతి చెందాడు. దీనికి కారణం కలుషిత నీరేనని బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. కలుషిత నీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గంట గంటకూ పెరుగుతున్న బాధితులు
గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై ఓ వ్యక్తి ప్రాణం తీసింది. 120 మందికి పైగా అస్వస్థతకు గురయ్యాయని బస్తీ వాసులు అంటున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కలుషిత నీరు సరఫరా చేస్తున్నారని, దీనిపై వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) అనే వ్యక్తి గురువారం రాత్రి మృతిచెందాడు. అతని రెండేళ్ల కుమారుడు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొండాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వడ్డెర బస్తీ వాసుల్లో మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమచారం. ఆసుపత్రిలో చేరిన వారిలో 11 మంది చిన్నారులు కూడా ఉన్నారు. బాధితుల్లో చలి, విపరీతమైన జ్వరం, వాంతులు, విరోచనాల బాధపడుతున్నారు. రాత్రి నుంచి బాధితులు సంఖ్య పెరగడంతో వైద్యులు సీరియస్ గా ఉన్న వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లమని చెబుతున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
జీహెచ్ఎంసీ తాగునీటి విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీటి కుళాయిల్లో డైనేజ్ నీరు ప్రవహించిందని బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. నల్లగా ముగురునీటిని తలపించేలా కలుషిత జలం సరఫరా అయింది. కుళాయి నీటిపై ఆధారపడిన బస్తీ వాసులకు ఆ నీరే ఆసుపత్రిపాలుజేసింది. నీరు తాగిన వారిలో ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు,కడుపునొప్పి ఇలా వివిధ లక్షణాలు కనిపించాయి. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది బాధితులు తీవ్ర అనారోగ్యంతో చేరారు. విపరీతంగా వాంతులు అవ్వడంతో కనీసం నడవలేని స్థితిలో ఆసుపత్రికి చేరారు. మరి కొందరైతే మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు. ఈ కాలనీలో గత రెండు నెలలుగా తాగునీరు పరిశుభ్రంగా లేదని, రంగుమారి వస్తోందని, కలుషితనీరు తాగలేకపోతున్నామంటూ స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక నాయకులకు తమ సమస్యను వివరించారు. కానీ ఎలాంటి స్పందన కనిపంచలేదు.
కొండపూర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు
బాధితుల కోసం కొండాపూర్ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డులను కేటాయించామని, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశామని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వరదాచార్య తెలిపారు. ఇప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పర్యావేక్షిస్తూ తగిన వైద్యం అందిస్తున్నామని ఏబీపీ దేశంతో తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారిలో ఒకరిద్దరు తప్ప మిగతా అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆహారం లేదా తాగునీరు కలుషితమవ్వడం వల్లనే ఇలా అస్వస్థతకు గురైయ్యారని తెలిపారు డాక్టర్ వరదాచార్య.