Chikoti Praveen Farm House : చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లో ఫారెస్ట్ అధికారుల తనిఖీలు, అరుదైన జంతువులు గుర్తింపు!
Chikoti Praveen Farm House : క్యాసినో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కు హైదరాబాద్ శివారులో ఓ ఫామ్ హౌస్ ఉంది. ఇందులో చాలా రకాల జంతువులను ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
Chikoti Praveen Farm House : క్యాసినో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లో అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని సాయిరెడ్డి గూడెంలోని చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ లో పాములు, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఇగుణ్ లు ఉన్నాయన్న సమాచారం వచ్చిందని ఫారెస్ట్ అధికారులు అన్నారు. ఫ్రెండ్లీగా ఉండే పక్షులు పెంచుకోవచ్చని, కానీ పాములు, ఇతర జంతువులు పెంచుకునేందుకు అనుమతులు తప్పనిసరి అన్నారు.
అనుమతులు లేకపోతే కేసులు
ప్రవీణ్ ఫామ్ హౌజ్ లో పైథాన్ ఉందని సమాచారం వచ్చిందని, కానీ తనిఖీల్లో దొరకలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫామ్ హౌజ్ అంతా తనిఖీ చేశామని, జూలో ఉండాల్సిన వాటిని ఇక్కడ బంధించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న జంతువులను గుర్తించి, అనుమతులు ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామన్నారు. ఫామ్ హౌజ్ నిర్వాహకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ వివరించారు.
ఫామ్ హౌస్ లో తనిఖీలు
చికోటి ప్రవీణ్ మామ మాధవ రావ్ మాట్లాడుతూ ఫామ్ హౌజ్ నిర్వహిస్తున్నామని, అయితే ప్రవీణ్ తనకు ఇష్టమైన పక్షులను మాత్రమే ఇక్కడ పెంచుకుంటున్నారన్నారు. ఇక్కడ ఎలాంటి పార్టీలు జరగవన్నారు. ఇక్కడ ఉన్న జంతువులు, పక్షులకు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. పది రకాలు డాగ్స్, కశ్మీర్ కు చెందిన మేకలు, గుర్రాలు, ఇతర జంతువులను పెంచుతున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఆఫ్రికా దేశానికి చెందిన అరుదైన జంతువులను గుర్తించామన్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లో కొన్ని ప్రమాదకర జంతువులు కూడా ఉన్నాయని వాటిని జూకి తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. ఫామ్ హౌస్ ను పరిశీలించిన అధికారులు చాలా జంతువులను పెంచుతున్న గుర్తించారు. అయితే వీటికి తగిన అనుమతులు తీసుకున్నట్లు నిర్వాహకులు పత్రాలు చూపిస్తున్నారని ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. వాటిని తనిఖీ చేస్తున్నారు.
ప్రముఖులతో లావాదేవీలు
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ వ్యవహారంలో ప్రముఖ సినీతారలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. చికోటి ప్రవీణ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న సమాచారాన్ని విశ్లేషిస్తున్న ఈడీకీ చాలా మంది ప్రముఖులతో నిర్వహించిన లావాదేవీలు సమాచారం లభించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చికోటి ప్రవీణ్ ఫోన్‌ను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని వాట్సాప్ సమాచారాన్ని మొత్తం విశ్లేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ల్యాప్ ట్యాప్‌తో పాటు మరికొన్ని డిజిటల్ ఆధారాలను కూడా ఈడీ అధికారులు సేకరించారు.
సాధారణ తనిఖీలే
ఈడీ సోదాలు, నోటీసులు అంశంపై మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్ కుమార్ స్పందించారు. సాధారణ సోదాల్లో భాగంగానే ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. వారికి ఏదో డౌట్ వచ్చి ఉంటుందని, అందుకే తనిఖీలు చేసుకుంటున్నారని అన్నారు. తనకు నోటీసులు కూడా ఇచ్చినందున విచారణకు హాజరై చెప్పుకుంటానని అన్నారు. తాను నిర్వహించిన క్యాసినోలు అన్నీ లీగలే అని చెప్పుకొచ్చారు. నేపాల్‌లో గోవాలో, దేశంలో తాను నిర్వహించిన క్యాసినోలు అన్నీ లీగల్ అని అన్నారు. సాధారణ వ్యక్తి అయిన మిమ్మల్ని ఈడీ ఎందుకు టార్గెట్ చేసిందని విలేకరులు ప్రశ్నించగా, వాళ్లకి ఏవో డౌట్లు ఉండడం వల్లనే వచ్చారని అన్నారు. మనీలాండరింగ్ లాంటి ఆరోపణలు ఏం ఉన్నా తాను సమాధానం చెప్పుకుంటానని అన్నారు.