Telangana Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం - ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజులు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
IMD Red Alert To Telangana Districts: ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాన్ని అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ వాయుగుండం ఒడిశా పూరీకి ఆగ్నేయంగా 70 కి.మీలు, ఏపీలోని కళింగపట్నం తూర్పు ఈశాన్యానికి 240 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది శనివారం ఉదయానికి వాయువ్య దిశగా పయనించి.. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ - వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని.. దీని ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావంతో ఈశాన్య, తూర్పు జిల్లాలైన కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, వరంగల్, ఖమ్మం, హన్మకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అటు, శనివారం ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవొచ్చన్నారు. అలాగే, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలోనూ భారీ వర్షాలు
మరోవైపు, ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.8 అడుగులకు చేరుకుంది. ఉమ్మడి తూ.గో జిల్లాలో దాదాపు 7 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉమ్మడి విశాఖ, కోనసీమ, అల్లూరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని మన్యం గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. అటు, పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది. అటు, వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ముందస్తు ప్రణాళికతో పని చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. గతంలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో గోదావరి కట్టలు బలహీనపడ్డాయని.. వాటి దృష్టి సారించాలని సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించవచ్చని పేర్కొన్నారు.