Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
Hyderabad Rains : హైదరాబాద్ లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడా, మైత్రివనం, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలిలో భారీ వర్షం కురిసింది. సనత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, గండిపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్, పాటు ఇతర ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపాడు. సాయంత్రం వేళ కావడంతో ఇంటికి వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. నగరంలోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.
Rain are UNSTOPPABLE in West #Hyderabad.
— Hyderabad Rains (@Hyderabadrains) October 8, 2022
👉#KPHB, #Kukatpally, #Hafeezpet,#Jntu Surroundings witnessing Heavy Downpour from last 1Hour.
👉More and More Rains Forming once again #Attapur Surroundings will again Spread towards North.
STAY ALERT!⚠️⚠️⚠️#HyderabadRains pic.twitter.com/DguaVjePWu
Severe Rain Alert!!! For West #Hyderabad.#Madhapur Crossed 75mm+ already, Looking at the Present Conditions 120-150mm+ on cards Over West #Hyderabad in next 2hrs.
— Hyderabad Rains (@Hyderabadrains) October 8, 2022
STAY SAFE ⚠️⚠️⚠️#HyderabadRains pic.twitter.com/DCBEWxd0z7
సికింద్రాబాద్, బేగంపేట్, ప్రకాష్ నగర్, మారేడ్ పల్లి, సీతాఫల్ మండి ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరింది. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. వాహనదారులు, ప్రజలు నీటి ముంపు ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. రాజేంద్రనగర్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. అత్తాపూర్, నార్సింగీ, బండ్లగూడ, మణికొండ, గండిపేటలో భారీ వర్షం పడింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా రెండు గంటల పాటు వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. రహదారులు చెరువును తలపిస్తున్నాయి. ఉప్పర్ పల్లి 192 పిల్లర్ నెంబర్ వద్ద భారీగా వరద నీరు చేరింది. రోడ్డు పైకి వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు.
శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షం
కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు వానకు తడిసి ముద్దయ్యారు. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి, కోకాపేట్, గండిపేట, మణికొండ, పుప్పాల్ గూడా, హిమాయత్ సాగర్, బండ్లగూడ జాగిర్ ప్రాంతాల్లో కుంతపోత వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ లో అత్యధికంగా 4.6 సెంటీమీటర్లు, చందానగర్ లో 4.3 సెంటీమీటర్లు, అత్తాపూర్ లో 2.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షంతో నగరంలోని రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.