Vizag News: అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ - వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
Visakhapatnam: విశాఖపట్నం భారీ కార్యక్రమాలకు వేదిక కాబోతోంది. ఇన్వెస్టర్స్ సమ్మిట్ తో పాటు నావికాదళం ఫ్లీట్ రివ్యూ కూడా ఫిబ్రవరిలో జరగనుంది.

Visakhapatnam international level events: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ ఇప్పుడు అంతర్జాతీయ ఈవెంట్లకు వేదికగా మారుతోంది. విశాఖ నగరం పలు కీలక అంశాలకు వేదికగా నిలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న పలు వేడుకలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ ప్రముఖులు విశాఖ వస్తున్నారు. అందుకే నిఘా పెంచారు. పటిష్టమైన భధ్రత వ్యవస్థను నెలకొల్పుతున్నారు. అదే సమయంలో వచ్చే అతిథులు మంత్ర ముగ్ధులయ్యేలా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సిటీ బ్యూటీఫికేషన్ తో పాటుగా సరికొత్తగా నగరంలోని ప్రముఖ కూడళ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ విభాగాలన్నీ పూర్తి స్థాయిలో పనులు చేయిస్తున్నాయి.
సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా కeన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో పెట్టుబడుదారుల సదస్సు జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఆంధ్రాయూనివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో జరగనున్న ఈ సదస్సు దేశంలోని ప్రముఖ వ్యాపార వేత్తలతో పాటుగా అంతర్జాతీయ స్థాయి వ్యాపార దిగ్గాజాలు, వాణిజ్య సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపుగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా సమ్మట్ నిర్వహిస్తుండటంతో విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు, నగర సుందరీకరణ పనలు చేపడుతున్నారు. నారా లోకేష్ స్వయంగా ఏర్పాట్లను చూసుకుంటున్నారు.
సాగరం తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్య్వూ
భారత నావికాదళానికి అత్యంత కీలకమైన విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం దేశ రక్షణకు సంబంధించిన ప్రతిష్టాత్మక వేడుకలను విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2026 ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్య్వూ (ఐఎఫ్ ఆర్) జరగనుంది. పలు ప్రపంచ దేశాలకు చెందిన నావికాదళాలు ఈ వేడుకలకు హాజరై తమ నౌకాదళ అస్త్రాలు, ఆయుధ సంపత్తి శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించబోతున్నాయి. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరుకానున్నారు. అలాగే మన నౌకాదళానికి చెందిన ఐఎన్ ఎస్ విక్రాంత్ జలాంతర్గామి నుంచి ఆయుథ సంపత్తిని రాష్ట్రపతి పరిశీలిస్తారు.
నౌకాదళ మరో కార్యక్రమం మిలాన్
మిలాన్ పేరిట నౌకాదళానికి చెందిన మరో కీలక వేడుకకు కూడా విశాఖ ఆతిధ్యం ఇవ్వబోతోంది. పలు దేశాలకు చెందిన నౌకాదళాలు, కోస్టు గార్డులు మిలాన్ వేడుకలకు హాజరుకానున్నాయి. సాగర తీరంలో తమ విన్యాసాలను ఈ మిలాన్ లో భాగంగా ప్రదర్శించబోతున్నాయి. సిటీ పరేడ్ అత్యంత ఆకర్షణగా నిలబోతోంది. అలాగే భారత నావికాదళం ఆధ్వర్యంలో పలు దేశాలకు నేవీ అధిపతులు సదస్సు కూడా జరగనుంది. పలు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, పరస్పరం సమాచారం అందిపుచ్చుకోవడం, పకడ్బందీ భద్రతపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సదస్సులకు విశాఖ వేదిక కావడంతో అంతర్జాతీయంగా పేరు మార్మోగనుంది.





















