(Source: Poll of Polls)
Drugs Case: డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తి ఎడ్విన్ బెయిల్‌పై రిలీజ్, అరెస్టైన 11 రోజుల్లోనే - అంతా షాక్!
ఎడ్విన్ పోలీసులకు పట్టుబడిన 11 రోజుల్లోనే విడుదల అవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఎంతో కష్టం చేసి, వ్యయప్రయాసలు పడి ఎట్టకేలకు పట్టుకున్న ప్రధాన నిందితుడు మళ్లీ చేజారాడు. డ్రగ్స్ కేసులో పోలీసులు కీలక సూత్రధారి అయిన అతణ్ని పట్టుకోవడం కోసం గోవాలో పోలీసులు మూడు నెలలపాటు ప్రత్యేక ఆపరేషన్ చేసి హైదరాబాద్ పట్టుకొచ్చారు. అతనే ఎడ్విన్. తాజాగా ఇతను బుధవారం (నవంబరు 16) బెయిల్‌పై విడుదలయ్యాడు. పట్టుబడ్డ అనంతరం ఇతణ్ని గోవా డ్రగ్ డాన్ అని, మత్తు మాఫియా కింగ్‌పిన్ అని పోలీసులు అభివర్ణించారు. అలాంటి వ్యక్తి ఎడ్విన్‌కు నాంపల్లిలోని ఒకటో అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం (నవంబరు 16) బెయిల్ మంజూరు చేసింది.
ఎడ్విన్ పోలీసులకు పట్టుబడిన 11 రోజుల్లోనే విడుదల అవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) యాక్ట్ కింద ఎడ్విన్‌ను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతడిపై పీడీ చట్టం ప్రయోగించడంతోపాటు గోవాలో అతడి ఆస్తుల్ని జప్తు చేయించే ప్రక్రియలో పోలీసులు నిమగ్నం అయ్యారు. సాధారణంగా NDPS చట్టం కింద జైలుకు వెళ్లినట్లయితే నెలల తరబడి నాలుగు గోడలకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో మాత్రం డ్రగ్స్ దందాలో కీలకమైన నేరస్థుడు ఇలా విడుదల కావడం వివాదాస్పద అంశంగా మారింది. అతడికి బెయిల్ రాకుండా ఉండేందుకు బలమైన ఆధారాల్ని కోర్టులో సమర్పించడంలో పోలీసులు విఫలం అయ్యారనే విమర్శ వినిపిస్తోంది.
ఈ కేసుల్లో ముందస్తు బెయిల్
నిజానికి ఈ ఎడ్విన్ పైన NDPS చట్టం కింద హైదరాబాద్ రాంగోపాల్ పేట, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. రాంగోపాల్‌పేట స్టేషన్ లో నమోదైన కేసులో ఈనెల 5న అరెస్ట్ చేశారు. అయితే అంతకుముందే మిగిలిన రెండు స్టేషన్ల కేసుల్లో ఎడ్విన్ అప్పటికే బెయిల్ పొంది ఉన్నాడు. కానీ, రాంగోపాల్‌పేట కేసులో ఎడ్విన్ చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండగానే.. మిగిలిన రెండు కేసుల్లో ముందస్తు బెయిళ్లను రద్దు చేయించాలని హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు ప్రయత్నించారు. ఈ మూడు కేసులను ఆధారంగా చేసుకొని ఎడ్విన్‌పై పీడీ చట్టం ప్రయోగించి ఏడాదిపాటు కటకటాలకే పరిమితం చేయాలని భావించారు. దీంతో గోవా డ్రగ్ మాఫియాలో వణుకు పుట్టించాలని అనుకున్నారు. కానీ ప్రతి ఆదివారం రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలన్న షరతు విధించింది. అనంతరం ఎడ్విన్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.
డ్రగ్స్ చెలామణిలో కీలక వ్యక్తి
గోవా నుంచి మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌ను అడ్డుకుంటే హైదరాబాద్ యువత మత్తుకు దూరం అవుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులు కీలక ఆపరేషన్లను చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ నేతృత్వంలో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు అయ్యాయి. మత్తు దందాలో కీలకమైన ఎడ్విన్ కోసం న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి మరీ ఈ నెల 5న గోవా నుంచి తీసుకొచ్చారు. 11 రోజుల్లోనే ఎడ్విన్ అనూహ్యంగా బెయిల్ పొందడం పోలీసులకు ఎదురుదెబ్బలాంటిదనే చర్చ జరుగుతోంది.