Congress Leaders on Komatireddy : కోమటిరెడ్డిపై టి.కాంగ్రెస్ నేతలు ఆగ్రహం, చర్యలు తీసుకోవాలని డిమాండ్
Congress Leaders on Komatireddy : బీఆర్ఎస్ పొత్తు అంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. దీంతో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డిపై మండిపడుతున్నారు.
Congress Leaders on Komatireddy : తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు మరోదారి లేదని కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవాల్సిందే అన్నారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపుతున్నాయి. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే కోమటిరెడ్డిపై చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన పార్టీ లైన్ దాటి మాట్లాడరన్నారు. వెంకట్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మాటలు పార్టీకి తీవ్ర నష్టం అన్నారు. తెలంగాణలో ఎవరితోనూ పొత్తులుండమని రాహుల్ గాంధీ స్పష్టంచేశారన్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఈ విషయం స్పష్టం చేశారన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం లెక్కలోకి తీసుకోదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థాక్రే ఆరా తీశారు. టీపీసీసీ నేతలతో మాట్లాడారు. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది.
అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం
కాంగ్రెస్ కు 40-50 సీట్లు మాత్రమే వస్తాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.. కోమటిరెడ్డి పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ను బలహీనపర్చేందుకు కాకుండా బలోపేతానికి నేతలు ప్రయత్నిస్తే బాగుంటుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను అద్దంకి దయాకర్ తప్పుబట్టారు. వెంకట్ రెడ్డి ప్రవర్తన అభ్యంతరకంరాగ ఉందన్నారు. కాంగ్రెస్ క్యాడర్ మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకోవాలన్నారు. గతంలో వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. కోమటిరెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తెలిపారు. మాణిక్ రావు థాక్రే కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు- వీహెచ్
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు. తప్పులుంటే సరిదిద్దుకుని ముందుకెళ్లాలని సూచించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలన్నారు. ఎంపీగా గెలిచి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుంటే కార్యకర్తలు కన్య్ఫూజ్ అవుతున్నారని వీహెచ్ అన్నారు. జోతిష్యం చెప్పడం ఎవరికి అవసరం లేదన్నారు. కింది స్థాయిలో కార్యకర్తలు కొట్లాడుతుంటే పైన మనం కొట్లాడుతుంటే ఎలా అని ప్రశ్నించారు.
కోమటిరెడ్డికి ఆ ఉద్దేశంతో అన్నారు- జగ్గారెడ్డి
కాంగ్రెస్ ప్రధాన శత్రువు బీజేపీనే అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సందర్భం వస్తే సెక్యులర్ భావాలున్న పార్టీలతో కలవొచ్చు అన్నారు. అదే ఉద్దేశంతో కోమటిరెడ్డి అన్నారని తెలిపారు. ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకుని ప్రసక్తి లేదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి నష్టం లేదన్నారు.