Komatireddy Venkatreddy : కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జ్ కు కోమటిరెడ్డి షాక్, కాల్ చేస్తే అంతమాట అనేశారా?
Komatireddy Venkatreddy : తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్ థాక్రేను అప్పుడే షాక్ మొదలయ్యాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాల్ చేసిన ఠాక్రే గాంధీభవన్ కు రావాలని కోరారు. అందుకు కోమటిరెడ్డి నిరాకరించారు.
Komatireddy Venkatreddy : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ థాక్రేకు ఆదిలోనే షాక్ ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాణిక్ థాక్రేకు ఫోన్ చేశారు. గాంధీభవన్‌కు రావాలని కోరారు. అయితే అందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరాకరించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన మాణిక్ థాక్రే మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చారు. టీపీసీసీ నేతలు, సీనియర్ నేతలతో మాణిక్ థాక్రే ఒక్కొక్కరిగా సమావేశమవుతున్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్ చేసిన థాక్రే... గాంధీ భవన్‌కు రావాలని, సమస్యలపై చర్చించుకుందామని కోరారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దానికి తిరస్కరించారు. తాను గాంధీ భవన్‌కు రాలేనని తేల్చి చెప్పారు. వీలైతే బయట కలుస్తానని ఠాక్రేకు స్పష్టం చేశారు.
పార్టీ వ్యవహారాలకు దూరంగా
మునుగోడు ఉపఎన్నికను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా వ్యవహరించారని కోమటిరెడ్డికి పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలోనూ కోమటిరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తరచూ బీజేపీ నేతలు, దిల్లీలో ప్రధాని మోదీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అవుతున్నారు. దీంతో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బాటలోనే వెంకట్ రెడ్డి పయణించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
సీనియర్ల తో థాక్రే భేటీ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే చార్జ్ తీసుకున్నారు. ఆయన తెలంగాణ పార్టీని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గాంధీ భవన్‌లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్‌ఛార్జ్ హోదాలో తొలిసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్, పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా గాంధీభవన్ కు చేరుకుని ముఖ్యనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబులతో వేర్వేరుగా థాక్రే భేటీ అయి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీని కూడా నిర్వహిస్తారు. గురువారం కూడా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటారు. డీసీసీలు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్‌లు, అధికార ప్రతినిధులతో మాణిక్‌రావు థాక్రే చర్చించనున్నారు. మరోవైపు ఈనెల 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పాదయాత్రపైనా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశమూ ఉంది. కొత్త ఇంచార్జ్ రాకపై సీనియర్ నేతల స్పందన ఎలా ఉంటుందోనని టీ కాంగ్రెస్ వ్యవహారాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఏ నేత ఇంచార్జ్ గా వచ్చినా అసమ్మతి గ్రూపు వారికి చుక్కలు చూపిస్తూ వస్తోంది. అప్పట్లో కుంతియా..ఆ తర్వాత వచ్చిన మాణిగం ఠాగూర్ కూడా అసంతృప్తి నేతలను తట్టుకోలేకపోయారు.