Kishan Reddy : అనాథపిల్లలకు ప్రధాన మంత్రే గార్డియన్, రేపు పీఎం కేర్స్ చిల్డ్రన్ పథకం ప్రారంభం- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy On PM Cares : కరోనా కారణంగా అనాథలైన పిల్లలను దత్తత తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వారికి ప్రధాని గార్డియన్ గా ఉంటారన్నారు. 23 ఏళ్లు వచ్చేవరకూ వారి బాధ్యత భారత ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు.
Kishan Reddy On PM Cares : దేశంలో అనాథ పిల్లలకు ప్రధాని గార్డియన్ గా ఉంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సోమవారం పీఎం కేర్స్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కారణంగా తల్లిందండుర్లును కోల్పోయిన పిల్లలకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. 23 ఏళ్లు వచ్చేవరకూ వారి బాధ్యత భారత ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించారు. 4345 మంది పిల్లలను ప్రధాని దత్తత తీసుకోనున్నారని తెలిపారు. అనాథ పిల్లల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు లోపు వారందరికీ పది లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 23 ఏళ్లు వచ్చేవరకూ ప్రతీ నెలా స్టేఫండ్ ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
పిల్లల దత్తత
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ లో దత్తత తీసుకుంటున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి ఎన్‌పీఆర్ కన్వెన్షన్‌లో బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ 8 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పేదలకు చేరువయ్యాయన్నారు. 15 రోజులపాటు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
పాతబస్తీలో దౌర్జన్యం
కరోనా మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లలను దత్తత తీసుకోవడం, కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడతలో రూ. 20 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేయడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు కిషన్ రెడ్డి సూచించారు. పాతబస్తీలో ఉన్న హిందువుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడంతో హిందువులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ మత కల్లోలాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా బలగాలను పక్కన పెడితే హిందువులను ఊచకోత కోస్తామని కామెంట్స్ చేసిన అసదుద్దీన్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం అన్నారు. ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.