MP Arvind On Kavitha : నా ఇంటిపై దాడిలో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉంది, బంజారాహిల్స్ పీఎస్ లో ఎంపీ అర్వింద్ ఫిర్యాదు
MP Arvind On Kavitha : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటిపై దాడికి టీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టారని ఫిర్యాదులో తెలిపారు.
MP Arvind On Kavitha : హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఎమ్మెల్సీ కవిత తన మీడియా సమావేశంలో వెంటపడి తంతం కొట్టి కొట్టి చంపుతామంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఆ వెంటనే 50 మంది టీఆర్ఎస్ గూండాలు తన ఇంటిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 50 మంది టీఆర్ఎస్ నాయకులను ఉసిగొల్పి కవిత తన ఇంటిపై దాడికి పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి ఘటనలో కల్వకుంట్ల కవిత హస్తం ఉందంటూ ఎంపీ అర్వింద్ ఫిర్యాదు చేశారు.
ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి, 8 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్
బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై జరిగిన దాడిపై ఆయన తల్లి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 452,148,427,323,354, r/w 149 ipc సెక్షన్ల్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 8 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతో దాడులు
కేసీఆర్ కుటుంబం కుల అహంకారంతో మిడిసిపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే తన ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని అర్వింద్ ఇంటిపై దాడి చేయడం..తర్వాత కవిత చెప్పుతో కొడతానని హెచ్చరించిన తర్వాత ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కవితపై తానేం అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు. అసత్య ప్రచారం చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఖర్గేను.., కవిత కలిసిందని తాను చెప్పలేదని.. స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతతో టచ్‌లో
కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తన ఆరోపణలపై కవిత ఇంతగా రియాక్ట్ అయిందంటే అది నిజమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అందరి ఫోన్లు ట్యాప్ చేసే కేసీఆర్ తన బిడ్డ కాల్ లిస్ట్ తీస్తే నిజానిజాలు బయటకొస్తాయని అన్నారు. తన బిడ్డకు బీజేపోళ్లు ఫోన్ చేసిండని స్వయంగా కవిత తండ్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని అర్వింద్ గుర్తు చేశారు. తనకు కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ వాళ్లు కూడా టచ్లో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ గూండాలు ఇంట్లొకి చొరబడి బీభత్సం సృష్టించారని.. మా అమ్మను బెదిరించారన్నారు. తన తల్లిని బెదిరించే హక్కు మీకు ఎవరిచ్చారని ఎంపీ ప్రశ్నించారు. తనపై చీటింగ్ కేసు వేస్తానని కవిత ప్రకటించడంపై అర్వింద్ మండిపడ్డారు. తనపై ఏమని కేసు వేస్తారని.. టీఆర్ఎస్ మేనిఫెస్టో మొత్తం చీటింగేనని.. కవిత తన తండ్రిపైనే కేసు పెట్టాలన్నారు. పసుపు రైతులను తాను మోసం చేయలేదన్నారు. నిజామాబాద్ ఎన్నికల్లో 178 మంది నామినేషన్లు వేస్తే అందులో 78 మంది బీజేపీ కండువా కప్పుకున్నారని తెలిపారు. కవితకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. అన్ని పార్టీలలోనూ తనకు మిత్రులు ఉంటారన్నారు.