Etela Rajendar: తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ కొత్త ఎజెండా, ప్రాంతీయ పార్టీలకు ఛాన్స్ లేదు: ఈటల రాజేందర్
దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమికి అవకాశం లేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాగ్రహం నుంచి తప్పించుకోడానికి సీఎం కేసీఆర్ కొత్త ఎజెండా ఎత్తుకున్నారని ఆరోపించారు.
ఎన్డీఏ లేదా యూపీఏ(UPA) తప్ప దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajendar) అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ(Bjp) రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్(CM Kcr) ముంబయి టూర్ పై ఘాటుగా స్పందించారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కొత్త ఎజెండాతో పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో గతంలో సీఎం కేసీఆర్ అందరి దగ్గరకూ తిరిగారని ఏమయిందని ప్రశ్నించారు. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీయబోయినట్లు కేసీఆర్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.
ఇక్కడ సమస్యలు పరిష్కరించలేని కేసీఆర్ కొత్త ఎజెండా ఎత్తుకున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ(Telangana) ప్రజలు కేసీఆర్ అబద్ధపు ప్రచారం నమ్మే స్థితిలో లేరన్నారు. సీఎం కేసీఆర్ ఇకనైనా భూమి మీదకు రావాలన్నారు. ప్రతిపక్షాల సూచనలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం అనేక ఉద్యమాలు జరిగాయన్న ఈటల రాజేందర్.. 1952లోనే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం, 1969 ఉద్యమం, మలిదశ ఉద్యమాలు జరిగాయన్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల చదువుకున్న విద్యార్థులకు నోటిఫికేషన్(Job Notifications) లేక, ఉద్యోగాలు లేక, పెళ్లిళ్లు కాక నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. చదువుకున్న అన్నకి పెళ్లి కాకుండా వ్యవసాయం చేసే తమ్ముడు ముందుగా పెళ్లిళ్లు చేసుకొనే పరిస్థితి వచ్చిందన్నారు. ఖమ్మం(Khammam)లో ఒక విద్యార్థి ఉద్యోగం ట్రైన్ కింద పడి చనిపోయారని గుర్తుచేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్(KTR) లేఖ రాశారని, దాంట్లో 1,32,899 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారని ఈటల రాజేందర్ అన్నారు. ఇది వాస్తవం కాదాన్నారు. ఆర్టీసీలో 4768 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పడం అబద్ధమన్నారు. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్, కండక్టర్ కూడా నింపలేదన్నారు. విద్యుత్తు శాఖలో 22,637 మందిని క్రమబద్దీకరణ చేసి ఉద్యోగాలు కల్పించామని గొప్పలు చెప్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా వెయ్యలేదన్నారు. టీచర్ల నియామకాలు లేవన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం(TRS Govt) శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండరని పర్మినెంట్ చేస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
తెలంగాణ వచ్చినప్పుడు సింగరేణిలో 65 వేల ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు 45 వేలు ఉన్నాయని అంటే ఉద్యోగాలు పెరిగినట్టా? తగ్గినట్టా? అని ఈటల ప్రశ్నించారు. 33 జిల్లాల పెంచారు, రెవెన్యూ డివిజన్ 72, మండలాలు 100 పెంచామని గొప్పగా చెప్తున్నారు కానీ దానికి అనుగుణంగా స్టాఫ్ పెంచలేదని విమర్శించారు. 1 లక్ష 90 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నానన్నారు.
'ప్రజా ఆగ్రహం నుండి తప్పించి కోవడానికి, పైరవీలు చేయించుకిని, ఫోన్ చేయించుకోవడం కేసీఆర్ కు అలవాటు. దేవెగౌడ(Devegowda)తో మాట్లాడినట్లు ప్రకటించుకున్నారు. కానీ రాజకీయాలు మాట్లాడలేదని దేవెగౌడ ట్విట్టర్ లో పెట్టారు కదా ఎన్ని అబద్ధాలు చెప్తారు. మమత, స్టాలిన్ ను కలిశారు ఒడిశా వెళ్లారు కదా ఏమైంది. అయితే NDA లేదా UPA తప్ప దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమికి అవకాశం లేదు. వీరు లేవగానే దేశమంతా లేస్తదా? కేంద్రం నేరుగా డబ్బులు రాష్ట్రాలకు ఇవ్వదు. తెలియని వారికి వట్టిగా మోసపు మాటలు చెప్పడం కేసీఆర్ కి అలవాటు. సమ్మక్క, సారలమ్మ గిరిజన దేవతలు కాబట్టి వారికి నోరు లేదు కాబట్టి మేడారానికి సీఎం పోలేదు. కుంభమేళా తర్వాత అంత పెద్ద జాతర ఇది. ప్రజల సంస్కృతిని గౌరవించరా ? గవర్నర్(Governor) వస్తే కనీసం స్వాగతం పలికే సంస్కారం లేదా?' ఈటల రాజేందర్ ప్రశ్నించారు.