Bandi Sanjay : పోలీసుల వాహనాల్లో టీఆర్ఎస్ డబ్బులు తరలిస్తున్నారు, బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Bandi Sanjay : మునుగోడులో ధర్మయుద్ధం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. ఆపదలో ఆదుకునే వాళ్లు కావాలో కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేవాళ్లు కావాలో ప్రజలు నిర్ణయించాలన్నారు.
Bandi Sanjay : `ఆపదలో ఆదుకునే మొనగాడు కావాలో సీఆర్ మోచేతి నీళ్లు తాగేటోడు కావాలో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగోడు ప్రజలతో ‘‘ఆత్మీయ సమ్మేళనం’’లో ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నిధులతోనే కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలు అంటూ ఎద్దేవా చేశారు. తినడానికే తిండిలేని కేసీఆర్ వేల కోట్లు ఎట్లా సంపాదించారని ప్రశ్నించారు. గొర్ల పథకం పైసలపై తన సవాల్ కు కేసీఆర్ భయపడి పారిపోయారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు వాహనాల్లో టీఆర్ఎస్ డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు నిధులు సమకూరుస్తున్న కంపెనీలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమార్కులపై విచారణ చేస్తామన్నారు. ఫలితాలు తారుమారైతే కేసీఆర్ అహం తలకెక్కి మళ్లీ ఫాంహౌజ్ కే పరిమితమ్యే ప్రమాదం ఉందన్నారు.
మునుగోడులో ధర్మయుద్ధం
మునుగోడులో ధర్మయుద్దం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. మునుగోడులో ఆపదలో ఆదుకుంటూ ప్రజలు మంచి చేస్తున్న మొనగాడు గెలవాలా? గడీల పాలనలో కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేటోడు గెలవాలా? ఆలోచించి ఓటేయాలని మనుగోడు ప్రజలను కోరారు. టీఆర్ఎస్ నిధులతోనే కాంగ్రెస్ ప్రచారం చేస్తోందన్నారు. కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలుగా మారిపోయారని, సీపీఐ జాతీయ మహాసభలకు టీఆర్ఎస్ నిధులు సమకూర్చినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఆయన అక్రమాలపై మాట్లాడుతుంటే కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని నాగోల్ లో మునుగోడు ప్రజలతో బీజేపీ నిర్వహించిన ‘‘ఆత్మీయ సమ్మేళనం’’లో బండి సంజయ్ పాల్గొ్న్నారు. మనోహర్ రెడ్డికి టిక్కెట్ రాకపోయినా ఏమాత్రం అసంతృప్తి లేకుండా పార్టీ గెలుపే తన గెలుపుగా భావించి కష్టపడి పనిచేస్తున్నారన్నారు. పాదయాత్ర ద్వారా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుపు ఖాయమని నివేదికలు చెబుతున్నాయన్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ ను గల్లీలోకి వచ్చారంటే బీజేపీ కారణం
"ఇవి తెలంగాణ భవిష్యత్ కు సంబంధించిన ఎన్నికలు. మోసపూరిత పాలనకు సమాధి కట్టే ఎన్నికలు. పొరపాటున ఫలితాలు తారుమారైతే... ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా, ఇంటికో ఉద్యోగం ఇయ్యకపోయినా, నిరుధ్యోగ భృతి ఇవ్వకపోయినా, అవినీతికి పాల్పడినా, అరాచక పాలన కొనసాగించినా ప్రజలు ఆశీర్వదించారని కేసీఆర్ భావించే ప్రమాదం ఉంది. కేసీఆర్ అహంకారం మరింత ఎక్కువై మళ్లీ ఫాంహౌజ్ కే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ఆర్థిక సాయం చేస్తోంది. టీఆర్ఎస్ ఇచ్చే నిధులతోనే కాంగ్రెస్ మునుగోడు ఎన్నికల ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ మధ్య ఇదే మాట చెప్పిండు. కేసీఆర్ ఫాంహౌజ్ ను వీడి గల్లీలోకి వచ్చారంటే బీజేపీ చేస్తున్న పోరాటలే కారణం. తినడానికి తిండి లేక... తిరగడానికి కారు కూడా లేని కేసీఆర్ ఈరోజు 100 కోట్లతో విమానం ఎట్లా కొంటున్నారు? వేల కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించారు? విదేశాల్లో పెట్టుబడులు ఎట్లా పెడుతున్నారో ఆలోచించండి. "- బండి సంజయ్