(Source: ECI/ABP News/ABP Majha)
Bandi Sanjay : గవర్నర్ విషయంలో హైకోర్టు చివాట్లు, కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్?- బండి సంజయ్
Bandi Sanjay : గవర్నర్ ను బదనాం చేయాలనుకున్న కేసీఆర్ సర్కార్ హైకోర్టులో భంగపడిందని బండి సంజయ్ అన్నారు. బడ్జెట్ ఆమోదానికి సమయం ఉన్నా వివాదం చేశారన్నారు.
Bandi Sanjay : బయ్యారం స్టీల్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడం లేదంటూ 8 ఏళ్లుగా ప్రధాని మోదీని, కేంద్రాన్ని తిట్టడమే సీఎం కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అసలు బయ్యారం స్టీల్ ఏర్పాటుపై ఇంతవరకు డీపీఆర్ ఇవ్వనేలేదనే విషయం కేంద్రం తేల్చిందన్నారు. మూడున్నరేళ్లుగా లేఖ రాసినా స్పందనేలేదని చెప్పిందన్నారు. ఇప్పుడు కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని బండి సంజయ్ ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి మోసం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై చర్చకు రాకుండా అబద్ధాలతో కేసీఆర్ ప్రజలను దారి మళ్లించేందుకు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు గవర్నర్ ను బదనాం చేసేందుకు హైకోర్టుకు వెళ్లి భంగపడ్డారన్నారు. ఈ విషయంలో హైకోర్టు చెంప చెళ్లుమన్పించినా కేసీఆర్ కు సిగ్గు రాలేదన్నారు. బడ్జెట్ ఫైలుకు 3 రోజులుగా ఆమోదం తెలపడంలేదని కోర్టుకెక్కిన కేసీఆర్.. స్పీకర్ ఫిరాయింపు ఫైలును ఏళ్ల తరబడి పెండింగ్ లో పెడితే ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలన్నారు.
మరో 20 జవాబులు తప్పుల తడక
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మరో 20 జవాబులు తప్పుల తడకగా మారాయని, వెంటనే సరిజేయడంతోపాటు ఈ పరీక్షలకు పెట్టిన నిబంధనలను సడలించాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో సర్పంచులతో సహా అన్ని వర్గాలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ ముందు సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నమే ఇందుకు నిదర్శనమన్నారు. పోలీసుల దాడిలో గాయపడి గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ ను సోమవారం మధ్యాహ్నం బండి సంజయ్ పరామర్శించారు.
ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
"బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ డీజీపీ ఆఫీస్ కు వెళ్లిన బీజేవైఎం నాయకులపైన పోలీసులు విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేశారు. నేమ్ ప్లేట్, బ్యాడ్జ్ లేకుండా పోలీస్ డ్రస్ లో వచ్చి మర్మాంగాలపై దాడి చేయడంతోపాటు తీవ్రంగా గాయపరిచారు. నష్టపోయిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయమని కోరడం తప్పా? దేశంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలు పెడతారా? ప్రశ్నాపత్రాలు తప్పుల తడక. 20 ప్రశ్నలకు జవాబులు తప్పు. వాటికి మార్కులివ్వాలనే సోయి లేదు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. అరెస్ట్ లు చేసి జైళ్లకు పంపుతున్నారు. తక్షణమే ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ ప్రాంతానికి పోయినా నిజాం రాజులే అనుకుంటున్నారు. కేటీఆర్ కమలాపూర్ రేపు వెళుతుంటే ఈరోజే బీజేపీ నాయకులు, కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి స్టేషన్ లో పెడుతున్నారు." - బండి సంజయ్
చర్చకు సిద్ధమా?
రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. దమ్ముంటే ఈ అంశాలపై చర్చకు రావాలన్నారు. తెలంగాణలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో చెప్పాలన్నారు. గవర్నర్ విషయంలో హైకోర్టు చివాట్లు పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ కు కోర్టులంటే లెక్కలేదని, రాజ్యాంగాన్ని పట్టించుకోరన్నారు. ప్రజలు కూడా ఆయనను పట్టించుకోవడం మానేశారన్నారు. అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ను పిలిస్తే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. బడ్జెట్ కు అనుమతి కోసం ఇంకా టైం ఉందని, కోర్టుకు వెళ్లి గవర్నర్ ను బదనాం చేసే ప్రయత్నం ఎందుకు చేశారని ప్రశ్నించారు. అందుకే కోర్టు చెంప చెళ్లు మన్పించిందన్నారు.
సర్పంచ్ దంపతుల ఆత్మహత్యయత్నం బాధాకరం
"నిజామాబాద్ కలెక్టరేట్ లో బిల్లులు రాలేదని సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరం. కేసీఆర్ సర్పంచులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నరడానికి ఇదే నిదర్శనం. చేసిన పనులకు బిల్లులివ్వరు. కేంద్రం ఇచ్చిన నిధులకు సర్పంచులకు తెలియకుండా తస్కరిస్తారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన ఎంపీ అరవింద్ ను దూషిస్తున్నారు. కేసీఆర్ దృష్టిలో నోరు మూసుకుని కూర్చునే వాళ్లు మంచోళ్లు, ప్రశ్నించే వాళ్లు దుష్టులు" - బండి సంజయ్