Bandi Sanjay On KCR : పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో ముందు కేసీఆర్ చెప్పాలి - బండి సంజయ్
Bandi Sanjay On KCR : ఏపీ వాళ్లు తయారుచేసిన బిర్యానీ పెండ బిర్యానీ అని ఎద్దేవా చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ విమర్శించారు.
Bandi Sanjay On KCR : గతంలో ఏపీ ప్రజలను అవమానించిన కేసీఆర్ ఇప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఏపీ ఓటర్లను నమ్మించి ఓట్లు వేయించుకోవడం సీఎం కేసీఆర్‌కు తెలిసిన విద్య అంటూ విమర్శించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఎన్నికలు అయిపోయాక నీళ్ల వాటాపై ఏపీ, తెలంగాణ అని మళ్లీ రెచ్చగొడతారని మండిపడ్డారు. ఏపీ వాళ్లను గతంలో కేసీఆర్ అవమానించలేదా? అని ప్రశ్నించారు. అప్పట్లో ఏపీ వాళ్లు తయారు చేసిన బిర్యానీని పెండ బిర్యానీ అన్నారని గుర్తుచేశారు. ఉలవచారును తెలంగాణలో ఎడ్లు, బర్లు తింటాయని కేసీఆర్ ఎగతాళి చేశారన్నారు. కేసీఆర్ ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీ ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీకి చెందిన వ్యాపారులు హైదరాబాద్ లో ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదని బండి సంజయ్ విమర్శించారు. ఆంధ్ర ప్రజలతో ఓట్లు వేయించుకుని తర్వాత వారిని పట్టించుకోరన్నారు. ఏపీకి క్యాబ్ లు పంపి బీఆర్ఎస్ లో చేరేందుకు నేతలను తెచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడేలేరని ఎద్దేవా చేశారు.
రూ. 17 వేల కోట్లు ఎటుపోతున్నాయ్
తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్ లేదని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్‌ఎస్ కు జాతీయ అధ్యక్షుడు లేరని అలాంటప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో 18 లక్షలు ఉన్న బోర్లు 23 లక్షలకు పైగా పెరిగాయన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ 5వ స్థానం ఉందని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో 4వ స్థానంలో ఉందన్నారు. లిక్కర్ ద్వారా రూ.44 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టగా రూ.17 వేల కోట్లు మిగులుతున్నాయని, ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందో అర్థంకావడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమీపించడంతో ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల నోరు మూయించేందుకు కేసీఆర్ ఈ ప్లాన్ వేశారని మండిపడ్డారు. తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిన కేసీఆర్ దేశాన్ని ఎలా ఉద్దరిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.
పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో
బీఆర్ఎస్ పరిస్థితి ప్రజలకు అర్థమవుతోందని బండి సంజయ్ అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ అంటున్న కేసీఆర్... తెలంగాణ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్న కేసీఆర్...తెలంగాణలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు పునరుద్ధరించటం లేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వరదల్లో నీట మునిగింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కై కేఆర్‌ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరవ్వడంలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలన్నారు. పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో ముందు కేసీఆర్ చెప్పాలన్నారు. పాఠశాల విద్యలో తెలంగాణ 21వ స్థానంలో ఉందని, నిరుద్యోగంలో 4వ స్థానం, రైతు ఆత్మహత్యల్లో 5వ స్థానంలో తెలంగాణ ఉందన్నారు. యువతను బీజేపీని దూరం చేసేందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.