Himanta Biswa Sarma On KCR : సూర్యుడి పైనో, చంద్రుడి మీదో కేసీఆర్ ప్రభుత్వం- హిమంత బిశ్వ శర్మ
Himanta Biswa Sarma On KCR : కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న కేసీఆర్ కల నెరవేరదని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శించారు.
Himanta Biswa Sarma On KCR : జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కల నెరవేరదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన బిశ్వ శర్మ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మరో 30 ఏళ్ల వరకు బీజేపీ అధికారంలో ఉంటుందన్న ఆయన... విపక్షాలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల నెరవేరదని స్పష్టం చేశారు. సముద్రంలోనో, సూర్యుడి మీదో, చంద్రుడి మీదో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు. కేంద్రంలో అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అవకాశమే లేదన్నారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని, కేసీఆర్ కొత్తగా చేయాల్సిందేం లేదన్నారు.
Sought blessings from Bhagwan Sri Krishna & prayed for everyone's well-being at the famous Sri Shyam Mandir, Hyderabad.
— Himanta Biswa Sarma (@himantabiswa) September 9, 2022
Hon DoNER Min Shri @kishanreddybjp ji, Cabinet colleague Shri @jayanta_malla, Hon MP Shri @PmargheritaBJP & Hon MLA Shri @manabdeka accompanied me. pic.twitter.com/aNic6xfoJI
వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే!
కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. ఈ విషయాన్ని గ్రహించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయాలని, లేదంటే ఆయన ఎక్కడకు వెళ్లినా గౌరవం లభించదన్నారు. సీబీఐ, ఈడీల గురించి మాట్లాడే వారికి అవి అంటే భయం అని బిశ్వ శర్మ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు. దేశంలో ఎంతమంది జట్టుకట్టినా దేశ ప్రజల మనసులోంచి ప్రధాని నరేంద్ర మోదీ తుడిచేలేరన్నారు. తెలంగాణ ప్రజలు నిజాం పాలనను కోరుకోవడంలేదని విమర్శించారు.
ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ లోని ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గణేశ్ శోభాయాత్రలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్యర్యంలో మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాగత వేదికపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకుడు భగవంతరావు మాట్లాడుతుండగా స్థానిక టీఆర్ఎస్ నాయకుడు నందకిశోర్ స్టేజ్ పైకి వచ్చి మైకు లాక్కునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నందకిశోర్ ను అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి టీఆర్ఎస్ కార్యకర్తను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం అసోం సీఎం హిమంత మాట్లాడుతూ తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతోందని, కేసీఆర్ కుటుంబానికి మాత్రమే మంచి జరుగుతోందని విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నానని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ప్రభుత్వం ప్రజలందరి కోసం పనిచేయాలి కానీ, ఒక కుటుంబం కోసం కాదని విమర్శించారు. తెలంగాణలో రజాకార్ల పాలనకు ముగింపు పలకాలన్నారు. దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. అంతకుముందు హిమంత బిశ్వశర్మ ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ఆయన మాట్లాడాల్సి ఉండగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అంతకు ముందు తలసాని ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.
Also Read : జాతీయ పార్టీ పెట్టాలి .. తెలంగాణలాగే దేశాన్నీ బాగు చేయాలి - కేసీఆర్‌కు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల విజ్ఞప్తి !