Breaking News: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 25న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణలో బుధవారం తెల్లవారుజామునే ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో కాకినాడ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 33 మంది ఉన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం, అతివేగమే ప్రమాదానికి కారణమని మునగాల ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. రాత్రి వేళ కావడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే బస్సు బోల్తా పడిపోయి ఉంది. దీంతో వారు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకొచ్చారు. ఇరుక్కుపోయిన వారిని తోటి ప్రయాణికులు కాపాడారు.
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..!
మాదక ద్రవ్యాల కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందుకు ఈడీ సమన్లు జారీ చేసిందని సమాచారం. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని సినీ ప్రముఖులను ఆదేశించింది. ఈనెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ ప్రశ్నించనుంది. ఎక్సైజ్ శాఖ 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు జరగనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
విద్యార్థులతో వాటర్ ట్యాంక్ కడిగించిన ఉపాధ్యాయులు.. 11కేవీ విద్యుత్ వైరు తగిలి విద్యార్థి మృతి
కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో దారుణం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయుల అత్యుత్సాహంతో విద్యార్థులతో నీటి ట్యాంకును కడిగించారు. అయితే ట్యాంక్ కడిగి బయటకి వస్తున్న విద్యార్థి గోపిచంద్ కి 11కేవీ విద్యుత్ వైరు తగిలి మృతి చెందాడు. విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసి స్కూల్స్ లో ఉపాధ్యాయులు అక్కడ నుంచి పరారయ్యారు. విద్యార్థి కుటుంబ సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఆందోళన నిర్వహించారు.





















