Rains in AP Telangana: మరింత బలపడిన అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు
Heavy Rains in Telangana: ఏపీ, తెలంగాణతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరో రెండు రెండులు భారీ వర్ష సూచన ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Southwest Monsoon: ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతాలపై కొనసాగుతున్న అల్ప పీడనం వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీర ప్రాంతాల్లోకి విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలదీ నైరుతి దిశగా వంగి ఉంటుందని, మరో 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరో రెండు రెండులు భారీ వర్ష సూచన ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మంగళవారం సైతం తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతం మీదుగా అల్ప పీడనం, అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఒడిశా తీరంలో అల్పపీడనం బలపడటంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు.
Press Release on Intense wet spells on 11th, 14th and 15th July 2022 in association with low pressure area over Northwest Bay of Bengal off Odisha coast. pic.twitter.com/4mlgSKuKKZ
— MC Amaravati (@AmaravatiMc) July 11, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది. జిల్లాల్లో నేటి నుంచి 2 రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఈ జిల్లాలకు సైతం ఎల్లో అలర్ట్ జారీ అయింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ రెండు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతాయి.
హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 12, 2022
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో గత ఐదు రోజులుగా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్ భూపాళపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.