Rains In AP Telangana: రెయిన్ అలర్ట్ - ఏపీ, తెలంగాణలో 2 రోజులు వర్షాలు, IMD ఎల్లో వార్నింగ్
Weather Updates Today: ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.
Rains in Telangana AP: ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు సైతం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా మధ్య ఆంధ్ర మీదుగా గాలుల సంఘమం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో
ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు సెప్టెంబర్ 24 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ ను నేడు సైతం మేఘాలు కమ్మేశాయి. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 24 వరకు పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 22, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం బలపడటంతో నేడు సైతం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు విశాఖ నగర పరిసర ప్రాంతాలలో పిడుగుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. గాజువాక - విమానాశ్రయం వైపు వర్షాలు నమోదవుతాయి. కాకినాడ జిల్లాలోని దక్షిణ భాగాలు ముఖ్యంగా కాకినాడ సిటీ - యానాంతో పాటుగా తూర్పు గోదావరి జిల్లా పోలవరం - రంపచోడవరం పరిసరాలు, పార్వతీపురం మణ్యం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదు కానుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు ఉత్తర భాగాలు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.