Heavy Floods: ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన!
Heavy Floods: తెలంగాణ సరిహద్దలో ఉన్న ప్రాణహితకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో సరిహద్దులో ఉన్న గూడెం వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది.
Heavy Floods: తెలంగాణ సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నదికి నీటి ప్రవాహం పెరుగుతోంది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండగా తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గూడెం వంతెనను తాకుతూ నది ప్రవహిస్తోంది. నదీ తీర ప్రాంతంలో ఉన్న పంటలన్నీ వరద నీటి కారణంగా ముంపునకు గురయ్యాయి. గత పదేళ్లలో ఇంత వరద ఎప్పుడూ రాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానెపల్లి మండలంలోని దిందా, గూడెం, కోయపెల్లి, చిత్తం, బూరుగూడ గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. మహారాష్ట్రలోని గోసికుర్ద్ డ్యాం గేట్లు ఎత్తివేయడంతోనే నదిలో నీటిమట్టం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరదతో పుష్కర ఘాట్లు నీట మునిగాయి. ఒడ్డున గల శ్రీకార్తీక్ మహరాజ్ ఆలయం చుట్టూ వరద చేరింది. తాటపల్లి, గుండాయిపేట, వీర్ధండి సమీపంలోని పెన్ గంగా నిండు కుండలా ప్రవహిస్తోంది.
వాగులో రైతు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు!
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం పాపన్నపేట గ్రామానికి చెందిన మడే భగవాన్ (45) అనే రైతు వాగులో గల్లంతు అయ్యాడు. పాపన్నపేట సమీపంలోని వాగు దాటే క్రమంలో గల్లంతు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రాణహిత నది ఉప్పొంగుతుండడంతో పాపన్నపేట సమీపంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. మడే భగవాన్ వ్యవసాయ పనుల కోసం ఒర్రె దాటే క్రమంలో గల్లంతు అయ్యాడు. అతడి ఆచూకీ కోసం నాటు పడవలు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. నాలుగు రోజుల కిందట పొలం పనులకు వెళ్లిన సమయంలో ప్రాణహిత వరద ప్రవాహానికి గల్లంతు అయ్యాడు. వరద ప్రవాహం భారీగా ఉండడంతో అతని ఆచూకీ నేటి వరకు దొరకలేదు. పోలిస్ సిబ్బంది, గజ ఈత గాల్ల సాయంతో నాటు పడవలో కలిసి వరద ప్రవాహంలో ఇప్పటికీ గాలిస్తున్నారు. ప్రాణహిత నది భారీగా ఉప్పొంగి ఉండడంతో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో పంట పొలాలకు, వేరే గ్రామాలకు, చేపలు పట్టేందుకు ప్రజలు ఏట్టి పరిస్థితుల్లో సాహసం చేయకూడదని అధికారులు సూచిస్తున్నారు.
కుంగిపోయిన అందవెల్లి బ్రిడ్జ్..!
జిల్లాలోని కాగజ్ నగర్ మండలం అందవెల్లి వద్ద గల పెద్దవాగు బ్రిడ్జ్ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. బ్రిడ్జి ఒక పిల్లర్ భూమిలోకి కుంగిపోయింది. భారీ వర్షాలకు పూర్తిగా బ్రిడ్జి కుంగి పోయి అత్యంత ప్రమాదకర స్థితికి చెరుకుంది. ఈ బ్రిడ్జ్ పై నుండి దహేగాం, భీమిని, మండలాలకు నిత్యం వందలాది మంది రాకపోకలు కొనసాగిస్తుంటారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎలాంటి ప్రమాదం జరగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అధికారులు సైతం బ్రిడ్జి ప్రమాదకరంగా వంగి పోవడటంతో బ్రిడ్జి అటు వైపు, ఇటు వైపు నుండి ఎవరిని రాకుండా చర్యలు తీస్కుంటున్నారు. అధికారులు త్వరలో కుంగిన బ్రిడ్జికి మరమ్మత్తులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.