Governor in Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి గవర్నర్ బ్రేక్ ఫాస్ట్, వారి సమస్యలు విని ఏమన్నారంటే!
Governor in Basara IIIT: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. అక్కడికి వచ్చి సమస్యలు తెలుసుకుంటానన్న హామీ మేరకు అక్కడికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.
Governor in Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేరుకున్నారు. నిజామాబాద్ నుండి బాసర చేరుకున్న గవర్నర్.. ముందుగా బాసర అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమిళిసై సమక్షంలో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ నుండి బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి చేరుకున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో గవర్నర్..
బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్న గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విద్యార్థులతో కలిసి ముందుగా బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం విద్యార్థుల గదులను, పరిసరాలను వారితో కలిసి పరిశీలించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలపై ఇటీవల గవర్నర్ తమిళి సై ని కలిశారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో నెలకొన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. చాలా రోజుల నుండి తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని గవర్నర్ కు చెప్పారు. వాటిని పరిష్కరించాలని ఆందోళన చేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు లేవని గవర్నర్ కు వెళ్లడించారు. ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి రావాలని విద్యార్థులు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కోరారు. విద్యార్థుల కోరిక మేరకు తప్పకుండా ట్రిపుట్ ఐటీకి వచ్చి సమస్యలను పరిశీలిస్తానని ఆనాడు గవర్నర్ మాట ఇచ్చారు. తప్పకుండా వస్తానని ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ నేడు బాసర ట్రిపుల్ ఐటీ కి వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటున్నారు.
మీడియాకు నో ఎంట్రీ..
ఎప్పట్లాగే ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోకి మీడియాను పోలీసులు, అధికారులు అనుమతించడం లేదు. అప్పట్లో విద్యార్థులు నిరసన చేసిన సమయంలోనూ అధికారులు మీడియాను లోపలికి అనుమతించలేదు. గవర్నర్ పర్యటనలో ట్రిపుల్ ఐటిలోకి మీడియాను అనుమతించడం లేదు. దీంతో మీడియా ప్రతినిధులంతా ట్రిపుల్ ఐటీ గేటు వద్దనే నిరీక్షిస్తున్నారు.
బాసర నుండి తెలంగాణ వర్సిటీకి గవర్నర్..
బాసర విద్యార్థులు, అధికారులతో చర్చల అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నిజామాబాద్ లోని తెలంగాణ విశ్వ విద్యాలయానికి గవర్నర్ వెళ్లనున్నారు. వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులు, సిబ్బందితో భేటీ అవుతారు. సమస్యలు, సౌకర్యాల కల్పనపై విద్యార్థులతో చర్చిస్తారు. వారి సమస్యలను వింటారు. తర్వాత నిజామాబాద్ చేరుకుని అక్కడి నుండి రైలులో హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు.
విద్యార్థుల కోసం ఎక్కడివరకైనా వెళ్తా..!
ఇటీవల రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయ విద్యార్థులతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్ భవన్ లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వర్సిటీల్లో నెలకొన్న సమస్యలు, విద్యార్థులు కోరుతున్న కనీస సౌకర్యాలపై వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. విద్యార్థుల కోసం ఎక్కడి వరకైనా వెళ్తానని, అవసరం అయితే తన విచక్షణాధికారాలను వినియోగిస్తానని మాట ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారమే ప్రస్తుతం ఆమె బాసర ట్రిపుల్ ఐటీని సందర్శిస్తున్నారు.