Telangana E Seva : మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ - మీ సేవ కార్యాలయాల మంజూరు.. రుణాలు కూడా !
Telangana Mee Seva మహిళా స్వయం సహాయక సంఘాలు ఈసేవ కేంద్రాలు పెట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది. వాటిని ఏర్పాటు చేసుకునేందుకు రెండున్నర లక్షల రుణం కూడా మంజూరు చేస్తోంది.
Mee Seva Centers : స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మీ సేవ కేంద్రాలను కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ సేవ, మీ సేవ పేరుతో కేంద్రాలను మంజూరు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రజలకు మీ సేవ ద్వారా ఆన్‌లైన్ సేవలు అందడంతో పాటు వాటి నిర్వహణ ద్వారా మహిళా సంఘాలు కూడా ఆర్థికంగా లాభం పొందనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 4525 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో మూడు వేల వరకు పట్టణ, నగర ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. పన్నెండు వేలకుపైగా పంచాయతీలు ఉంటే.. వెయ్యి గ్రామాల్లోనే మీ సేవ కేంద్రాలున్నాయి. ఈ సేవ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల చిన్న పనులకు కూడా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది.
గ్రామాల్లో మహిళా సంఘాలకు మీ సేవ కేంద్రాలు
ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు వీటిని కేటాయించాలని నిర్ణయించింది. గ్రామాల్లో మీ సేవ కేంద్రాలు పెట్టుకునేందుకు స్వయం సహాయ సంఘాలకు రెండున్నర లక్షల వరకూ రుణం మంజూరు చేయనున్నారు. ఈ ధనంతో ఈ సేవ కేంద్రాలకు అవసరమైన సాంకేతిక పరికరాలను కేటాయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తారు కాబట్టి.. ఆ కేంద్రాలకు అవసరమైన స్థలం కూడా ప్రభుత్వ భవనాలలోనే లభ్యతను బట్టి కేటాయించే అవకాశం ఉంది. ఇంటర్ పాసైన వారిని ఆపరేటర్లుగా పని చేసేందుకు శిక్షణ ఇప్పిస్తారు. మీ సేవ అధికారుల పర్యవేక్షణలో ఇవి పని చేస్తాయి.
రెండున్నర లక్షల రుణంతో పాటు శిక్షణ కూడా !
మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఆగస్టు 15నాటికి గ్రామాల్లో మీసేవ కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మహిళల అభ్యున్నతికి రేవంత్ సర్కార్ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల మహిళాశక్తి క్యాంటీన్లను కూడా ప్రారంభించారు. నే ఎస్‌హెచ్‌జీ సభ్యులతో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి మహిళా శక్తి క్యాంటిన్లను ప్రారంభించారు.
మహిళా సంఘాలకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రేవంత్ సర్కార్
క్యాంటీన్ విస్తీర్ణంకు అనుగుణంగా ఒక్కోదాంట్లో ఐదు నుంచి 20 మంది సభ్యులు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆసక్తి, కష్టపడే తత్వం కలి గిన 50 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను ఎంపిక చేశారు. శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీ సేవ కేంద్రాలను కూడా మహిళా సంఘాలకు కేటాయిస్తూండటంతో.. మహిళలు పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలబడే అవకాశం కలుగుతోంది.