Goshamahal MLA: సీఎం కేసీఆర్ ఆ పని చేస్తే నేను రాజీనామా చేస్తా.. తేల్చి చెప్పిన ఎమ్మెల్యే రాజా సింగ్
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శలు చేశారు. జీహెచ్‌ఎంసీ నిధులను కేసీఆర్ ఎంఐఎం కోసం మాత్రమే ఖర్చు చేస్తోందని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు.
హుజూరాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు ఎసరు పెడుతున్న సంగతి తెలిసిందే. వారు రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల కొద్దీ నిధులు నియోజకవర్గానికి విడుదల చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కేసీఆర్ కనుక తన నియోజకవర్గం గోషామహల్‌కు నిధులు కేటాయిస్తే వెంటనే తాను రాజీనామా చేసేస్తానని తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శనాస్త్రాలు సంధించారు. జీహెచ్‌ఎంసీ నిధులను కేసీఆర్ సర్కారు ఎంఐఎం కోసం మాత్రమే ఖర్చు చేస్తోందని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తే బడుగులు, రైతులపై ముఖ్యమంత్రికి ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తోందని అన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ప్రజలు డిమాండ్ చేస్తున్న విషయాన్ని రాజా సింగ్ పేర్కొన్నారు.
Also Read: Karimnagar Suicide: జాబ్ నోటిఫికేషన్ రావట్లేదని రైలు కింద పడ్డ యువకుడు.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రత్యేక వీడియోలో మాట్లాడి దాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని ప్రజలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారని రాజా సింగ్ అన్నారు. తన సొంత నియోజకవర్గం హైదరాబాద్‌లోని గోషామహల్‌లో తనను ప్రజలు కూడా రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. అయితే, అందుకు ఓ షరతు విధించారు.
తన నియోజకవర్గం గోషామహల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వాటిని తన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కేటాయించుకుంటానని చెప్పారు. ఆయన తన గోషామహల్ నియోజకవర్గానికి నిధులు ఇస్తానంటే తాను రాజీనామా కూడా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. దళిత బంధు విషయంలో కేవలం వారికి మాత్రమే కాకుండా.. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ, పేద ఓసీలకు కూడా రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని చెప్పారు. గోషామహల్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని సీఎం కేసీఆర్‌కు రాజా సింగ్ సవాల్ విసిరారు.
Also Read: Hyderabad Nizam Alam: 18 ఏళ్ల క్రితం మాయం.. ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం.. హాట్ టాపిక్‌గా నిజాం ఆలమ్