Google Vice President: 'తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చేందుకు ఏఐ' - గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తో సీఎం రేవంత్ కీలక భేటీ
Telangana News: సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ గురువారం భేటీ అయ్యారు. ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Google Vice President Meet CM Revanth Reddy: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని.. తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని గూగుల్ వైస్ ఛైర్మన్ తోట చంద్రశేఖర్ (Thota Chandra Sekhar) తెలిపారు. గురువారం సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన.. భేటీ అయ్యి పలు కీలక విషయాలపై చర్చించారు. రానున్న రోజుల్లో పరిపాలనలో డిజిటల్ టెక్నాలజీని భాగస్వామ్యం చేసేలా పలు విధానాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపైనా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
రహదారి భద్రతపై
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రత వంటి అంశాల్లో గూగుల్ సాయంతో ఏఐ వినియోగంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లోనూ డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణ పౌరుల అవసరాల తీర్చేలా నాణ్యమైన సేవలు అందించడానికి విస్తృత సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని సీఎంకు వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి రహదారి భద్రతపై కూడా ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వింగ్స్ అఫ్ ఫైర్ పుస్తకం రచయిత అరుణ్ తివారి, ప్రముఖ క్యాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి ఉన్నారు.
13 దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి బుధవారం 13 దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చారు. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాల్లో సత్సంబంధాలు కొనసాగించటానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుందని తెలిపారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జయేష్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Praja Palana: ప్రజాపాలన పేరుతో మెసేజ్, కాల్ వచ్చిందా!