Telangana Cabinet Decisions: డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Jobs For DSC 2008 Candidates: ఏపీ ప్రభుత్వం ఇచ్చినట్లుగా 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Telangana Cabinet Meeting Updates: హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని గ్యారంటీలు అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇచ్చినట్లు తెలంగాణలోనూ డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ డీఏస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ (టైం స్కెల్ ) ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు. 16 బీసీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కసరత్తు చేసినట్లు మంత్రులు పొంగులేటి, శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ఇళ్ల పథకంపై త్వరలోనే జీవో
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై త్వరలోనే జీవో ఇస్తామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తెలిపారు. పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం అన్నారు. మొదటి విడతగా 4 లక్షల 56 వేల ఇళ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు 84 శాతం మందికి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కమిటీలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో చేసిన విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విచారణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సైతం కేబినెట్ చర్చించింది. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు, నాణ్యతపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణకు కేబినెట్ నిర్ణయించింది. విచారణ చేపట్టి చంద్రఘోష్ కమిటీ 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గడువు ఇచ్చారు. మరో రెండు రోజుల్లో 93 శాతం రైతులకు రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి రేషన్ కార్డు పూర్తిగా నిత్యావసర సరుకులకు మాత్రమే ఉపయోగపడుతుంది.
16 బీసీ , ఎస్సీ , ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటుకు నిర్ణయం
1. ముదిరాజ్ కార్పొరేషన్
2. యాదవ కురుమ కార్పొరేషన్
3. మున్నూరుకాపు కార్పొరేషన్
4. పద్మశాలి కార్పొరేషన్
5. పెరిక (పురగిరి క్షత్రియ) కార్పొరేషన్
6. లింగాయత్ కార్పొరేషన్
7. మేరా కార్పొరేషన్
8. గంగపుత్ర కార్పొరేషన్
ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC)
9. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు
10. ఆర్య వైశ్య కార్పొరేషన్
11. రెడ్డి కార్పొరేషన్
12. మాదిగ, మాదిగ ఉప కులాల కార్పొరేషన్
13. మాల, మాల ఉప కులాల కార్పొరేషన్
మూడు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు
• కొమురం భీమ్ ఆదివాసి కార్పోరేషన్
• సంత్ సేవాలాల్ లంబాడి కార్పోరేషన్
• ఏకలవ్య కార్పోరేషన
• మహిళా సాధికారితలో భాగంగా మహిళల కోసం ఔటర్ రింగురోడ్డు చుట్టు మహిళా రైతు బజార్లు ఏర్పాటు (మహిళలే రైతు బజార్లు నిర్వహిస్తారు)
గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు. స్వయం సహాయక సబుగాల ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఓ.ఆర్.ఆర్ పరిధిలో 25 ఎకరాల స్థలంలో వసతి (కాంప్లెక్స్ ) ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే ఐదేళ్ళలో స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు 15 అంశాలతో కూడిన మహిళా శక్తి ప్రత్యేక పథకం అమలు చేయాలి. వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.