GODI India investments: తెలంగాణలో గోడి ఇండియా రూ.8000 కోట్ల పెట్టుబడి, 6 వేల మందికి ఉద్యోగాలు
GODI India invest Rs 8000 cr in Telangana: గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది.
GODI India to set up Lithium Giga Factory in Telangana: హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇదివరకే పలు ప్రముఖ కంపెనీలు తయారీ కేంద్రాలు, యూనిట్లు ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోగా, తాజాగా గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ (Lithium Giga Factory) తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. గోడి ఇండియా రూ.8000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్ లో 12.5 GWh (గిగావాట్ ఫర్ అవర్ ) సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్లు తెలిపింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో బుధవారం సమావేశమయ్యారు.
మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వంతో అదే వేదికగా గోడి ఇండియా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. రాబోయే అయిదు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి (R&D), గిగా స్కేల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముందుగా 2.5 గిగావాట్ల కెపాసిటీ సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి, రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరించనుంది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రభుత్వం ఫోకస్
గోడి ఇండియా పెట్టుబడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ లను ప్రోత్సహించటంతో పాటు పర్యావరణ అనుకూల వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు అవసరమైన విధానాలకు తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, పర్యావరణ వ్యవస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టు అనుసంధానమై ఉందని, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ల రూపకల్పనలో గోడి కీలకంగా నిలుస్తుందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి మహేష్ గోడి కృతజ్ఞతలు
తమ కంపెనీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న తెలంగాణ ప్రభుత్వానికి గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో వ్యాపారాలకు సానుకూల వాతావరణంతో పాటు పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ రూ.9 వేల కోట్లు పెట్టుబడి..
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడికి నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు దావోస్ వేదికగా ప్రకటించింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను ప్రకటించారు.