TS High Court Verdict: చెల్లెలికి అన్న కిడ్నీ ఇవ్వొచ్చు, అలాంటి భార్య పర్మిషన్ అక్కర్లేదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
మూత్రపిండాల వ్యాధితో చెల్లెలి కిడ్నీలు రెండూ చెడిపోవడంతో అన్నయ్య తన కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు. కానీ, అతని భార్యతో అప్పటికే విభేదాలు ఉన్నాయి. దీనిపై తేల్చుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ హైకోర్టు మంగళవారం (ఆగస్టు 10) కీలక తీర్పు వెలువరించింది. తోడపుట్టిన సోదరికి తన అన్న కిడ్నీ ఇవ్వడంపై తలెత్తిన సమస్యపై హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. మూత్రపిండాల వ్యాధి వల్ల చెల్లెలి కిడ్నీలు రెండూ చెడిపోవడంతో తన అన్నయ్య తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కానీ, అతని భార్యతో అప్పటికే విభేదాలు ఉన్నాయి. కొన్నాళ్ల నుంచి భార్య దూరంగా ఉంటోంది. ఆస్పత్రి వర్గాలు భార్య అనుమతి కోరాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయంపై తేల్చుకునేందుకు వారు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం భర్త కిడ్నీ ఇవ్వడానికి విభేదాల వల్ల దూరంగా ఉన్న భార్య అనుమతి అవసరంలేదని తేల్చి చెప్పింది. వెంటనే ఆపరేషన్ నిర్వహించాలంటూ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ అపోలో ఆసుపత్రికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్‌లో ఉంటున్న అన్నాచెల్లెళ్లు కె.వెంకట నరేన్, బి.మాధురి ఈ సమస్యలో చిక్కుకున్నారు. దీంతో వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్‌నాథ్ గౌడ్ విచారణ చేపట్టారు.
Also Read: Weather Updates: నేడు ఏపీలో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు.. తెలంగాణలో వాతావరణం ఇలా..
కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న తన సోదరికి తన ఒక మూత్రపిండం అవసరం ఉన్నందున అది ఇచ్చేందుకు తాను అంగీకరించానని పిటిషనర్ నరేన్ తన పిటిషన్‌లో వివరించారు. జులై 30న ఆపరేషన్ చేస్తామని అపోలో హాస్పిటల్ డాక్టర్లు కూడా చెప్పారని వివరించారు. కానీ, కిడ్నీ మార్పిడికి తన భార్య వల్లి అనుమతి అవసరమంటూ అపోలో అధీకృత కమిటీ నోటీసు పంపిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
అయితే, తన భార్యతో తనకు గతం నుంచి విభేదాలు ఉన్నాయని, తమ పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ జిల్లా స్థాయి కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని అపోలో ఆస్పత్రికి చెప్పామని నరేన్ వివరించారు. ఈ విషయంలో తన భార్యను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని వాపోయారు. ఆలస్యం అవుతుండడం వల్ల రోజురోజుకూ తన చెల్లెలి ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. బాధితుల అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్‌నాథ్ గౌడ్ ప్రత్యేక పరిస్థితుల్లో పిటిషనర్ భార్య అనుమతి కోసం ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన పిటిషన్‌పై విచారణకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి వాయిదా వేశారు.
Also Read: Indervelli: కాళ్లు, చేతులు నరికి పంపిస్తా, జాగ్రత్త.. రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు