అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులకు ఫ్రీ మెడికల్ క్యాంప్ - 10రోజుల పాటు
అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులకు I&PR ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి 10రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.
అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవం రోజున ప్రామిస్ చేసినట్టుగానే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి సిద్ధమైంది. అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులకు I&PR ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి 10రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కార కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. మేరకు ఈ నెల 29 తేది నుంచి మాసాబ్ ట్యాంక్ లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయనున్నట్లు I&PR కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.
ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ లో రక్తపరీక్ష(C.B.P), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్రపరీక్షలు, విటమిన్ బి12, డి3, పలురకాల డయాగ్నోస్టిక్స్ పరీక్షలు , ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మియర్, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, కంటి స్క్రీనింగ్ , దంతపరీక్షలు, గైనకాలజీ టెస్టులు చేస్తారు. ఈ పరీక్షల రిపోర్టులు అదే రోజు అందిస్తారు.
ఉదయం 7 గంటల నుంచి..
ఈ మెడికల్ క్యాంపుని ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహిస్తారు. I&PR ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఈ శిబిరంలో రాష్ట్రస్థాయి అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి అక్రిడిటేషన్ కలిగిన మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కోరారు. జిల్లాలకు చెందిన అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులకు ఆయా జిల్లా కేంద్రాలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
12 పరీక్షలు మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా..
రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మార్చి21న సీఎస్ శాంతికుమారి ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మహిళా జర్నలిస్టులకు దాదాపు 56 రకాల పారామీటర్లు, 12 పరీక్షలు మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా నిర్వహించాలని సూచించారు. ఇందుకు గాను I&PR కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కమీషనర్ ను కోరారు.
ఇప్పటికే న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని సీఎస్ శాంతికుమారి గుర్తుచేశారు. ఆ కోవలోనే మహిళా జర్నలిస్టులకు కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 5వేల మందికి పైగా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమం క్రింద వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని మహిళలకు సీఎస్ శాంతి కుమారి సూచించారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందచేసేందుకు 9 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని ఆమె అన్నారు. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గిందని, మరికొద్ది రోజుల్లో న్యూట్రిషన్ ఫుడ్ కిట్ అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు.