Tummala Nageswara Rao: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వేళ రాహుల్‌తో తుమ్మల కీలక భేటీ, అక్కడినుంచి సీటు కన్ఫార్మ్?
Tummala Nageswara Rao: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన వేళ రాహుల్ గాంధీతో తుమ్మల నాగేశ్వరరావు భేటీ కావడం కీలకంగా మారింది. ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది.
Tummala Nageswara Rao: తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. నేతల రాజీనామాలు, చేరికలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తుతో పాలిటిక్స్ వేడెక్కాయి. సీటు కోసం ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఢిల్లీలో అగ్రనేతలను కలుస్తూ లాబీయింగ్ చేస్తోన్నారు. సీటు దక్కదనే కారణంతో కొంతమంది నేతలు రాజీనామాలు చేస్తూ వేరే పార్టీలో కూడా చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్‌కు ఇప్పుడు రెబల్స్ భయం పట్టుకుంది.
కాంగ్రెస్ నుంచి సీటును ఆశిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్‌కు పుష్ఫగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల కొత్తగా పార్టీలో చేరడంతో మర్యాదపూర్వకంగా రాహుల్‌ను కలిసినట్లు తుమ్మల వర్గీయులు చెబుతున్నారు. కానీ అభ్యర్థుల ఖారారుపై అధిష్టానం చర్చలు జరుపుతున్న క్రమంలో రాహుల్‌తో తుమ్మల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పాలేరు నుంచి కాంగ్రెస్ టికెట్‌ను ఆయన ఆశిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తున్న సమయంలోనే రాహుల్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
రాహుల్ గాంధీతో భేటీ అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ ఎక్కడ నుంచి టికెట్ కన్ఫామ్ చేస్తే అక్కడ నుంచి పోటీకి సిద్దమని స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఎన్నికల్లో బరిలోకి దిగుతానని అన్నారు. పాలేరు నుంచి తాను పోటీ చేయాలని అనుకుంటున్నానని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పాలేరు నుంచే కాకుండా అవసరమైతే ఖమ్మం, కొత్తగూడెం స్థానం నుంచి అయినా టికెట్ ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని రాహుల్ తనను కోరినట్లు తమ్మల మీడియాకు వివరించారు. తాను కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తానని రాహుల్‌కు చెప్పానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని, ఖమ్మ జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా తుమ్మలను ఖమ్మం నుంచి పోటీలోకి దింపేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోన్నట్లు ప్రచారం చేస్తోంది. ఆయనకు ఖమ్మం నుంచి సీటు ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించుతుందనే ప్రచారం జరుగుతోంది. ఆదివారం 58 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుండగా.. ఇందులో ఖమ్మం జిల్లాలోని అభ్యర్థుల పేర్లు ఉంటాయని తెలుస్తోంది. తుమ్మలకు జిల్లావ్యాప్తంగా అనుచరగణం ఉంది. ఖమ్మంలో ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్ధిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. ఆయనను ఓడించాలంటే తుమ్మలనే సరైన అభ్యర్థి అని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో పువ్వాడకు గట్టి పోటీ ఇచ్చేందుకు మాజీ మంత్రిగా పనిచేసిన తుమ్మలను పోటీలోకి దింపుతున్నట్లు సమాచారం. ఖమ్మంలో ఇప్పటికే కాంగ్రెస్ బలంగా ఉంది. బీఆర్ఎస్ అంతగా బలం కనిపించడం లేదు. తుమ్మల, పొంగులేటి బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో ఇద్దరికి పొసిగేది కాదు. కానీ కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యారు. తుమ్మల ఇంటికెళ్లి స్వయంగా పొంగులేటి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.