Telangana Elections 2023 : కాంగ్రెస్‌లో చేరిన మండవ వెంకటేశ్వరరావు - నిజామాబాద్ కాంగ్రెస్‌కు కొత్త బలం !
Telangana Elections 2023 : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంత కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు.
Telangana Elections 2023 : మాజీ మంత్రి, బీఆరెస్ నేత మండవ వెంకటేశ్వర్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం బోధన్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయ మార్పు అనివార్యమైన పరిస్థితిలోనే పార్టీ మారడం జరిగిందన్నారు. పార్టీ మారడం ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదనితెలంగాణలో మార్పు కోసం ప్రతి ఓటర్ భాగస్వామ్య కావాలని మండవ వెంకటేశ్వరరావు కోరారు. తొలి విడత తెలంగాణ ఉద్యమంలో 360 మంది, రెండో విడతలో 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు.
ప్రశ్నించే వారిని అణిచివేసే వ్యక్తిగా కేసీఆర్
ఆత్మబలిదానాలను చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన అందరూ కేసీఆర్‌ను నిందిస్తున్నారని తెలిపారు. ప్రశ్నించే వ్యక్తిని అణిచివేసే వ్యక్తిగా కేసీఆర్ నిలిచారన్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోందన్నారు. ఉద్యోగస్తులకు 15వ తేదీ వరకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు ఐదు లక్షల కోట్ల అప్పు ఎట్లా అయిందన్నారు. ధరణి నష్టదాయకంగా తయారైందన్నారు. గతంలో రైతుబందు రూ.12000లకే సీఎం కేసీఆర్ భారమన్నారని, మరి ఇప్పుడు రూ.16,000 ఎక్కడి నుంచి తెచ్చేస్తారని ప్రశ్నించారు.
టీఆర్ఎస్‌లో చేరినా దక్కని గుర్తింపు
మండవ వెంకటేశ్వరరావు టిక్కెట్ల కేటాయింపు సమయంలోనే కాంగ్రెస్ లో చేరుతారని అనుకున్నారు. ఆయనకు కూకట్ పల్లి లేదా నిజామాబాద్ రూరల్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన చేరిక ఆలస్యమయింది. ఇప్పుడు ఎలాంటి టిక్కెట్ కేటాయించే అవకాశం లేకపోయినా ఆయన పార్టీ మారడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఆహ్వానం మేరకు మండవ బీఆర్ఎస్ లో చేరారు. కానీ ఆయనకు పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడంతో పార్టీ మారిపోయారు.
5 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన మండవ
మండవ సీనియర్ లీడర్. మంచి అనుభవం ఉన్న నేత. మంత్రిగా సైతం సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం. నిజామాబాద్ రూరల్ నాటి డిచ్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మండవ. మంత్రి పదవులు కూడా చేపట్టారు. చంద్రబాబుకు నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో సెటిలర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంపై మండవకు మంచి పట్టుంది. సెటిలర్స్ ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం నుంచే మండవకు 5 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన రికార్డు ఉంది. దీంతో నిజామాబాద్ లో కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉంటుందని అంచనా వేస్తున్నరు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply