Adviser Somesh : సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్ - ఉత్తర్వులు జారీ !
సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
![Adviser Somesh : సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్ - ఉత్తర్వులు జారీ ! Former IAS officer Somesh Kumar has been appointed as Chief Advisor to CM KCR. Adviser Somesh : సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్ - ఉత్తర్వులు జారీ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/09/00fc0b995edb5623c0c013f6c91e3df81683632730776228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Adviser Somesh : తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. మూడేళ్ల పాటు ఆయన పదవిలో ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ కాలం మూడేళ్ల పాటు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ మరో ఆరు నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఏర్పడే ప్రభుత్వం.. అప్పటి సీఎంను బట్టి కొనసాగించాలా వద్దా అనేదానిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అధికారిక ఉత్తర్వుల్లో మాత్రం మూడేళ్ల పదవి కాలం ఇచ్చారు. గతంలో సీఎస్‌గా పని చేసి రిటైరైన రాజీవ్ శర్మను కూడా కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుకు కేబినెట్ హోదా ఉంటుంది.
బిహార్‌కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించినా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ - క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలోనే ఆయన కొనసాగారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. క్యాట్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టులో డీవోపీటీ సవాల్ చేసింది. ఈ వ్యవహారంపై విచారణ తర్వాత కొద్ది నెలల క్రితం తెలంగాణ హైకోర్టు ఆయన్ను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసే అవకాశం కూడా లేక పోవడంతో సోమేష్ కుమార్ ఏపీ జీఏడీలో రిపోర్టు చేశారు. తెలంగాణ నుంచి రిలీవ్ అయిన సోమేష్‌కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆమోదముద్ర వేశారు. సోమేశ్ దరఖాస్తును డీవోపీటీ అంగీకరించింది. దీంతో ఆయనకు సలహాదారు పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.
సోమేష్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నమ్మకమైన అధికారి. ఆయన స్వస్థలం బీహార్. సోమేష్ కుమార్ కి బిహార్ లోని రాజకీయలపై పట్టు ఉంది. ప్రశాంత్ కిషోర్ తో గంటల కొద్దీ మాట్లాడే చనువు ఉంది. దేశ రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. సర్వేల ఇన్ పుట్స్ ఎప్పటికప్పుడు కేసీఆర్ కి చేరవేస్తూంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతూంటాయి. పార్లమెంట్ ఎన్నికల వరకు బిహార్ లోని ఏదో ఓ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున బరిలోకి దింపవచ్చని భావిస్తున్నారు.
చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికి వారిని కాదని కేసీఆర్ సోమేష్ కుమార్‌కు చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చారని విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కేసీఆర్ సర్కార్ అక్రమాల్లో ఆయనకు వాటా ఉందని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ధరణి పోర్టల్ విషయంలో ఈ ఆరోపణలు ఎక్కువగా వస్తూంటాయి. ఇప్పుడు ఏపీకి పంపినా సర్వీస్‌లో చేరకుండా రిటైర్మెంట్ తీసుకుని మళ్లీ సలహాదారుగా చేరడంతో విమర్శలు పెరిగే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)