Flower Price: తెలంగాణలో వికసించని పూలు, దిగుమతులే దిక్కు!
Flower Price: తెలంగాణ పండుగల్లో బతుకమ్మ అత్యంత ప్రధానమైనది. ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 22 వరకూ బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పండుగ సందడి రానుంది.
Flower Price: తెలంగాణ పండుగల్లో బతుకమ్మ అత్యంత ప్రధానమైనది. ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 22 వరకూ బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పండుగ సందడి రానుంది. రకరకాల పూలతో బతుకమ్మను చేసి పూజించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది పండుగకు పూలు దొరకడం కష్టంగా మారనుంది. రాష్ట్రంలో పూల లభ్యత గణనీయంగా తగ్గింది. గత మూడేళ్లుగా పూల దిగుబడి క్రమక్రమంగా తగ్గుతోంది. మల్లె పూల రేట్లు ఇప్పటికే చుక్కలు తాకుతున్నాయి. కనకాంబరాలు అసలు మార్కెట్‌లో కనిపించడం లేదు. కలువలు సంగతి చెప్పనవసరం లేదు. బంతి, చామంతి, గులాబీల సాగు పడిపోయింది.
పెరిగిన పూల ధరలు
బతుకమ్మ పండుగలో పూలదే కీలక పాత్ర. రకరకాల పూలతో బతుకమ్మలు తయారు చేసి పూజలు చేస్తారు. అయితే తంగేడు, గునుగు పూల లభ్యత పడిపోయింది. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా బంతి, చామంతి, గులాబీ పూలతో బతుకమ్మలను చేస్తున్నారు. పండుగ సీజన్‌లో పూల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగా బతుకమ్మ సమయంలో రాష్ట్రంలో దాదాపు రూ.100 కోట్ల మేరకు పూల మార్కెట్ ఉంటుంది. కానీ ఈ ఏడాది దిగుబడులు లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. గతంలో కిలో గులాబీ పూలు రూ.50 నుంచి రూ.60కి లభించేవి. ఇప్పుడు రూ.150 వరకు పలుకుతున్నాయి. కిలో రూ.80 ఉండే మల్లెల ధర రూ.200కి పెరిగింది. బంతిపూల ధర రూ.40 నుంచి రూ.80కి చేరింది.
ఆసక్తి చూపని రైతులు
ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోవడం, ఎక్కవ శాతం రైతులు నష్టాలు చవిచూడడంతో రైతులు పూల సాగు వైపు మొగ్గు చూపలేదు. దీంతో గత మూడు సంవత్సరాలలో పూల సాగు ఏకంగా నాలుగు వేల ఎకరాల మేరకు తగ్గిపోయింది. పెట్టుబడి, ఖర్చులు పెరగడం, గిరాకీ లేకపోతుండడంతో రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపలేదు. 2020 సంవత్సరంలో తెలంగాణలో 11 వేల ఎకరాల్లో పూలసాగు జరిగేది. బంతి, చామంతి, గులాబీ, మల్లెలు, కనకాంబరాలు ఇతర పూలను రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, వికారాబాద్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్‌లో పెద్ద ఎత్తున సాగు చేసేవారు.
దిగుమతులే దిక్కు
గతంలో రాష్ట్రంలో బంతి పూలు 2960 హెక్టార్లలో, చామంతులు 1320 హెక్టార్లలో, గుళాబీలు 1182 హెక్టార్లలో, మల్లె పూలు వెయ్యి హెక్టార్లలో సాగయ్యేవి. స్థానిక అవసరాలకు 80 శాతం మేరకు ఆయా ప్రాంతాల నుంచి దిగుబడి రూపంలో లభించేవి. అయితే మూడేళ్లుగా పరిస్థితి మారిపోయింది. పెట్టుబడుల వ్యయం, కూలీలు, గిట్టు బాటు అంశాలతో మూడేళ్లలో పూల సాగు నాలుగు వేల ఎకరాలు తగ్గింది. దీంతో రాష్ట్రంలో పూల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పూలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లో ప్రముఖ పూల మార్కెట్ గుడిమల్కాపూర్‌కు వచ్చే పూలలో 80 శాతం దిగుమతి చేసుకుంటున్నవే ఉంటున్నాయి.
భారమైన సాగు
గత మూడేళ్లలో ధరలు అన్నీ విపరీతంగా పెరిగాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్ర పరికరాల ధరలు 20 శాతం మేర పెరిగాయి. కూలీలు ఖర్చు కూడా రెట్టింపైంది. మిగిలిన పంటలతో పోలిస్తే వ్యయాలు పెరగడం, అధిక దృష్టి కేంద్రీకరించాల్సి ఉండడంతో చాలామంది రైతులు సాగును మానేస్తున్నారు. దీనికి తోడు 2020 తర్వాత రాష్ట్రంలో నీటి వనరులు పెరగడంతో అన్నదాతలు పూల నుంచి వరిసాగు వైపు మళ్లారు. రాష్ట్రంలో పూలసాగును పెంచాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్ణయించింది. వెయ్యి ఎకరాల్లో పాలీహౌస్‌లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. కానీ వాటికి పెద్దగా ఆదరణ లభించలేదు.