Jana Reddy As CM: ‘నేను సీఎం అవ్వొచ్చేమో’ - మనసులో మాట బయటపెట్టిన జానారెడ్డి
Jana Reddy: కాంగ్రెస్ పార్టీలో సీఎం సీటు ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సీఎం కుర్చీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి తన మనసులోని ఆశను, అభిప్రాయాన్ని బయటపెట్టారు.
Jana Reddy As CM: కాంగ్రెస్ పార్టీలో సీఎం సీటు ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సీఎం కుర్చీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి తన మనసులోని ఆశను, అభిప్రాయాన్ని బయటపెట్టారు. ప్రజల హృదయాల్లో తాను సీఎం కావాలని ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా గుర్రంపొడులో బీఆర్ఎస్ చెందిన జెడ్పీటీసీ గాలి సరిత రవి కుమార్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జానారెడ్డి మాట్లాడుతూ.. తనకు తానుగా ఏనాడు, ఏ పదవీ కోరుకోలేదన్నారు. సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమోనని అన్నారు. ఏ పదవి వచ్చినా కాదననని చెప్పారు.
‘అవసరం అయితే నా కొడుకు రాజీనామా చేస్తాడు’
ఇప్పటి వరకు ఏ సీఎం చేయనన్ని శాఖలు తానును నిర్వర్తించానని జానారెడ్డి చెప్పుకొచ్చారు. 21 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానని, 36 ఏళ్లకే మంత్రిని అయ్యాయని గుర్తు చేసుకున్నారు. తనకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, ఏ పదవులైనా వాటంతట అవే వస్తాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టే ఎక్కువ మంది పార్టీలోకి వస్తున్నారని ఆయన అంచనా వేశారు. ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు కాలేదా? అని ఆయన అన్నారు. అవసరమైతే తన కొడుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడని, తాను ఎమ్మెల్యేను అవుతానని ఆయన తెలిపారు. కాగా జానారెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడు జయవీర్ నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
డబ్బుతో కేసీఆర్ రాజకీయం
విద్యుత్ ఉత్పత్తి కోసం బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులు రాష్ట్ర ప్రజలకు భారంగా మారాయని జానారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో మూటలతో రాజకీయం చేసే సంస్కృతి బీఆర్ఎస్ తో మొదలైందని విమర్శించారు. పథకాలతో గెలవాల్సింది పోయి కేసీఆర్ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత కేసీఆర్ లేదని మండిపడ్డారు. తమ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూటలు, మాటల గారడీతో సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు మాయం అవుతుందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
అందరి కళ్లు సీఎం సీటుపైనే
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎం రేసులో ఉన్నానని ఆయన చెప్పడం ఇప్పుడు పార్టీలోనూ, రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. పీసీసీ అధ్యక్షడిగా ఉన్న రేవంత్ రెడ్డి తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని, డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదే రోజు ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయమన్నారు. ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే వస్తారని చెప్పుకొచ్చారు. 2018తో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలపడిందన్నారు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం సీఎం సీటు వైపు ఆశగా చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.