(Source: ECI/ABP News/ABP Majha)
Huzurabad Bypoll Result: గెలుపు బావుటా ఎగరేసిన ఈటల.. ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం
హుజూరాబాద్ ఎన్నికల వేడి.. రాష్ట్ర మెుత్తం కాక పుట్టించింది. ఫలితాలపై నరాలు తెగె ఉత్కంఠ. చివరకు ఫలితం రానే వచ్చింది. తనకు ఓటమి అంటే తెలియదని మరోసాని నిరూపించారు ఈటల.
ఈటల రాజేందర్ కు కేసీఆర్ ప్రభుత్వానికి నడుమ ఎన్నికలన్నట్లు హుజూరాబాద్ ఉపఎన్నిక జరిగింది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ముఖ్య నేతలంతా... రంగంలోకి దిగిపోయారు. ఈటల ఓటమికి కోసం నియోజకవర్గంలో గడప గడప తిరిగారు. కానీ హుజూరాబాద్ ప్రజలు ఏడోసారి కూడా ఈటలనే ఆశీర్వాదించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై మాజీ మంత్రి ఈటల.. 23,865 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. రాజీనామాతో.. హుజూరాబాద్ లో రాజకీయం వెడెక్కింది. ఈటలను ఎలాగైనా ఓడించాలని.. టీఆర్ఎస్ పక్కా ప్లాన్ వేసినా వర్క్ అవుట్ అవ్వలేదు. మళ్లీ హుజూరాబాద్ ప్రజలే తన బలమని ఈటల నిరూపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఈటల రాజేందర్ గెలుపొందారు. ఒక్కసారి ఈటల రాజకీయ చరిత్ర చూస్తే..
తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ కీలక నాయకుడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పని చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆప్త మిత్రుడిగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ 2001లో స్థాపించిన అనంతరం కేసీఆర్ పిలుపు మేరకు ఈటల రాజేందర్ 2002లో ఆ పార్టీలో చేరారు. ఇటీవలే దూరమయ్యారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి 1984 లో ఈటల రాజేందర్ బీఎస్‌సీ పూర్తి చేశారు. కమలాపూర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు గెలిచిన ఈటల.. ఆ తర్వాత ఏర్పడిన హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ఓటమి లేని నేత ఉన్నారు. ఇప్పటి వరకూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉపఎన్నిక వచ్చినా, మధ్యంతర ఎన్నికలు వచ్చినా.. తనకు తిరుగులేదని నిరూపించారు.
- 2021లో వచ్చిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 23,865 మెజారిటీతో గెలుపొందారు.
- 2018 మధ్యంతర ఎన్నికల్లో ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డిపై పోటీ చేసి 43,719 మెజారిటీతో గెలిచారు.
- 2014లో నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డిపై 57,037 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- 2010 లో 2010 హుజూరాబాద్ నియోజకవర్గం ముద్దసాని దామోదర్ రెడ్డిపై 79,227 మెజారిటీతో గెలిచారు.
- 2009 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ నాయకుడు వకులాభరం కృష్ణ మోహన్ రావుపై 15,035 మెజారిటీతో గెలిచారు.
- 2008లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి.. ముద్దసాని దామోదర్ రెడ్డిపై 22,284 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
- 2004లో కమలాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించారు.
- 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అనంతరం కేసీఆర్ పిలుపు మేరకు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
టీఆర్ఎస్ నుంచి బయటకెందుకు వచ్చారు?
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన కొందరు రైతుల నుంచి ప్రభుత్వం అసైన్ చేసిన భూములను ఈటల రాజేందర్, ఆయన అనుచరులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ కొందరు భూమి యజమానులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫిర్యాదు చేశారు. ఆ గ్రామాల్లోని సర్వే నంబరు 130/5, 130/9, 130/10 లలో ఒక్కొ కుటుంబానికి ఒక ఎకరం 20 గుంటల చొప్పున ఉన్న భూమిని, సర్వే నంబర్ 130/2లో ఉన్న 3 ఎకరాల భూమిని రాజేందర్ స్వాధీనం చేసుకున్నట్టు వారు ఆరోపించారు.
ఆ భూములు లాక్కోలేదనీ ప్రభుత్వ అనుమతితో తీసుకున్నాననీ ఈటల రాజేందర్ ఆ సమయంలో వివరించారు. ఈ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి తెలుసని అన్నారు. తాను ఆత్మగౌరవాన్ని అమ్ముకోనని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీఎస్, విజిలెన్స్ డీజీతో పాటూ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత.. బీజేపీకి లోకి చేరిపోవడం.. ఉపఎన్నిక రావడం.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై గెలవడం జరిగిపోయాయి.
Also Read: Huzurabad BJP : హుజురాబాద్‌లో గెలుపు ఈటలదా ? బీజేపీదా ?