Betting Apps: బెట్టింగ్ యాప్ కేసు - టాలీవుడ్ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు
Tollywood Actors: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ టాలీవుడ్ స్టార్స్‌కు తాజాగా నోటీసులిచ్చింది. విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, రానాలను విచారణకు రావాలని ఆదేశించింది.

ED Summons To Tollywood Actors: బెట్టింగ్ యాప్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పలువురు టాలీవుడ్ స్టార్స్‌కు ఈడీ తాజాగా నోటీసులిచ్చింది. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్‌లను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్ రాజ్, ఆగస్ట్ 6న విజయ్ దేవరకొండ, ఆగస్ట్ 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ తాజాగా విచారణ చేపట్టింది. పంజాగుట్ట, సూర్యాపేట, మియాపూర్, విశాఖలో నమోదైన కేసుల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఈ ప్రమోషన్లకు సంబంధించి గతంలో దాదాపు 29 మంది సెలబ్రిటీలు, కంపెనీలపై కేసులు ఫైల్ చేసింది.
Also Read: బెడిసి కొట్టిన లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఉర్ఫీ జావేద్ ఫేస్, కారణమిదే
ఇన్‌ఫ్లుయెన్సర్స్ నుంచి బుల్లితెర యాక్టర్స్ వరకూ...
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ నుంచి యాంకర్స్, బుల్లి తెర యాక్టర్స్, సెలబ్రిటీల వరకూ చాలామందిపై కేసులు నమోదయ్యాయి. రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, అనన్య నాగళ్ల, శ్యామల, సిరి హనుమంతు, వర్షిణి సౌదర్ రాజన్, వసంతి కృష్ణన్, శోభాశెట్టి ఇలా 29 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. చట్ట విరుద్ధ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ విస్తృతంగా ప్రచారం చేశారంటూ వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
ఆ సంస్థలకు నోటీసులు
రెండు రోజుల క్రితం టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని కంపెనీ ప్రతినిధులకు సూచించింది. మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినా... ఈ సంస్థలు తమ మాధ్యమాల్లో ఈ యాప్స్ ప్రచారం చేస్తున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కంపెనీలు బెట్టింగ్ యాప్స్ యాడ్స్‌కు స్లాట్స్ కేటాయించడమే కాకుండా వెబ్ సైట్ లింక్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నాయని చెబుతోంది. మరోవైపు, మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను విచారించింది. తాజాగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లను విచారించేందుకు రెడీ అవుతోంది.





















