BRS Vs BJP : కవితకు ఈడీ నోటీసులపై దుమారం - తెలగాణ ఆత్మగౌరవం చుట్టూ రాజకీయం !
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై దుమారం రేగింది. తెలంగాణ ఆత్మగౌరవం పై దాడి అని బీఆర్ఎస్ విమర్శిస్తూండగా.. బీజేపీ గట్టిగా కౌంటర్ ఇస్తోంది.
BRS Vs BJP : భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేయడం తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ అంశాన్ని తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిగా అభివర్ణిస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున ఇలా .. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కవితపై కుట్ర పూరితంగా నోటీసులు జారీ చేయడం కరెక్ట్ కాదని బీఆర్ఎస్ నేతలంటున్నారు. అయితే తెలంగాణ ఆత్మగౌరవం ఒక్క కవితకేనా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈడీ నోటీసులు రాజకీయ కట్రన్న బీఆర్ఎస్ !
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోలేకనే ఎమ్మెల్సీ కవిత పై కక్షపూరిత కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం విద్వేషపూరిత రాజకీయాలకు పరాకాష్ట అని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టించి, వాటి విశ్వసనీయతను దెబ్బతీసిందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ నోటీసులు, కేసులు అంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్ర విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని మరో మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. కేంద్రం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడం.. మరింతగా పోరాడుతామని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. మోదీ దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై కుట్రలో భాగమే కవితకు నోటీసులని మరో మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
కవిత వల్ల తెలంగాణకు తల వంపులన్న బీజేపీ !
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉందని ఈడీ చెప్పడంతో దేశం ముందు తెలగాణ సిగ్గుతో తలవంచుతోందని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళ కూడా లేదన్నారు. దీనికి కవిత ఆధిపత్య ధోరణే కారణమన్నారు. 2019 ఎన్నికల్లో కవిత ఓడిపోయిన తర్వాత నెపోటిజం కోటాలో ఎమ్మెల్సీ అయిన కవిత లిక్కర్ స్కాంలో కీలక కుట్రదారుగా ఉన్నారన్నారన్నారు. లిక్కర్ దందా చేసింది మీరు.. అక్రమంగా కోట్లు సంపాదించింది మీరు.. దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీలపై విమర్శలు చేయటం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించారు లిక్కర్ స్కాంలో కవితతోపాటు అందరికీ నోటీసులు ఇచ్చారని.. ఆమెకు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదన్నారు బీజేపీ మహిళా నేత డీకే అరుణ. దీన్ని కక్ష సాధింపుగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని.. తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత ఒక్కరే కాదని.. తెలంగాణ సమాజం అని వ్యాఖ్యానించారు డీకే అరుణ. మహిళలపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని.. ఈడీ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఈడీ విచారణపై రాజకీయంగా ఎవరి వాదన వారిది !
ఇటు బీఆర్ఎస్.. అటు బీజేపీ నేతలు కవితకు ఈడీ నోటీసులపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి ఈ విషయంలో తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగించుకుంటోంది. దీనిపై బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు జారీ చేసింది కానీ.. ఇప్పటి వరకూ ఆమె పేరును ఇంకా నిందితురాలిగా చేర్చలేదు. కానీ ప్రతీ రిమాండ్ రిపోర్ట్, చార్జిషీటులో కవిత పేరును ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు నోటీసులు కూడా జారీ చేయడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ కీలక నేత సిసోడియాను అరెస్ట్ చేశారు.