Hyderabad: అపోలో ఆస్పత్రికి ఈటల రాజేందర్ తరలింపు.. బండి సంజయ్, వివేక్ పరామర్శ
బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను ఆపోలో ఆస్పత్రిలో చేర్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ పరామర్శించారు.
హుజూరాబాద్‌లో ప్రజల మద్దతు కూడగట్టేందుకు కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా పాదయాత్ర చేస్తున్న బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కొండపాకలో మాట్లాడిన తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. కాళ్లకు పొక్కులు రావడం, జ్వరం, బీపీ ఒక్కసారిగా పడిపోవడం వంటివి జరిగాయి. దీంతో ఆయన్ను డాక్టర్ల సూచన మేరకు వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Also Read: Peddireddy Joins TRS: దళిత బంధు ఆగదు.. నన్ను చంపినా మోసం చేయను.. నొక్కి చెప్పిన కేసీఆర్
శనివారం ఈటల రాజేందర్‌ను ఆపోలో ఆస్పత్రిలో చేర్చారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అస్వస్థతకు గురైన ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈటలను కలిసి పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈటల ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్ వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈటల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈటలకు కోవిడ్ ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ వచ్చిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలో కోలుకుంటారని చెప్పారు.
మరోవైపు, ఈటల రాజేందర్ త్వరగా కోలుకోవాలని హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్‌లో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. కమలాపూర్ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఈటల కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈటల అనారోగ్యం బారిన పడడంతో ప్రజా దీవెన యాత్రను ఆయన భార్య ఈటల జమున కొనసాగిస్తారని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ నెల 19న హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం నుంచి ప్రజా దీవెన యాత్రను ఈటల రాజేందర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 222 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగింది. గురువారం జమ్మికుంట మండలం విలాసాగర్, పాపయ్యపల్లి, బిజిగిరిషరీఫ్, వెంకటేశ్వర్లపల్లి, కాపులపల్లి, కోరపల్లి, సైదాబాద్ గ్రామాల్లో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర కొనసాగించారు. వర్షం పడే సమయంలో కూడా ఆయన పాదయాత్ర సాగింది. శుక్రవారం పాదయాత్ర కొనసాగిస్తున్న ఈటల అస్వస్థతకు గురికావడంతో ఆయన అభిమానులు అందోళనకు గురయ్యారు. కోలుకున్న అనంతరం ఈటల ప్రజా దీవెన యాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.
Also Read: Hyderabad: మంచి నీళ్లు కావాలని ఇంట్లోకొచ్చారు.. మర్యాద చేసినందుకు నోట్లో గుడ్డలు కుక్కి బీభత్సం