Hyderabad: మంచి నీళ్లు కావాలని ఇంట్లోకొచ్చారు.. మర్యాద చేసినందుకు నోట్లో గుడ్డలు కుక్కి బీభత్సం
నీళ్లు కావాలని లోపలికి వచ్చిన దుండగులు యువకుడిని కట్టేసి, కొట్టి, బెదిరించి, చివరికి చోరీ చేసి పరారయ్యారు. చందానగర్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కాస్ట్రో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
స్నేహితుడి కోసం వచ్చారు.. మంచి నీళ్లు కావాలని అడిగారు. కనీస మర్యాదతో యువకుడు వారిని ఇంట్లోకి రానిచ్చినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. లోపలికి వచ్చిన దుండగులు అతణ్ని కట్టేసి, తీవ్రంగా కొట్టి, బెదిరించి, చివరికి చోరీ చేసి పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హుడా కాలనీకి సమీపంలోని ఇంజినీర్స్ ఎన్‌క్లేవ్‌లో చోటు చేసుకుంది. చందానగర్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కాస్ట్రో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చందానగర్‌లోని హుడా కాలనీ సమీపంలో ఇంజినీర్స్ ఎన్‌క్లేవ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మామిళ్లపల్లి శ్రీహర్ష (28), అతని స్నేహితుడు సాయిరాం ప్రసాద్ నివాసం ఉంటున్నారు. సాయిరాం సోలార్ కంపెనీలో ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ఇతను బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లో శ్రీహర్ష ఒక్కడే ఉన్నాడు. సరిగ్గా రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి మరో వ్యక్తి లేడా అంటూ ఆరా తీశారు. అతనితో వ్యాపారం గురించి మాట్లాడాలని, ఎప్పుడు వస్తాడని ఆరా తీశారు. బయటికి వెళ్లాడని, కాసేపట్లో వస్తాడు కూర్చోవాలని శ్రీహర్ష చెప్పగా.. వారు తాగేందుకు మంచి నీళ్లు అడిగారు.
నీళ్లు తెచ్చేందుకు శ్రీహర్ష లేచి వంట గదిలోకి వెళ్తుండగా అతని వెనకే వెళ్లిన దుండగులు అతణ్ని తీవ్రంగా గాయపర్చారు. తలను గోడకేసి బాదారు. దీంతో తీవ్రమైన గాయంతో శ్రీ హర్ష కింద పడిపోయాడు. అయినా వదలని దుండగులు అతని కాళ్లు, చేతులు వైరల్లతో కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కి వేధించారు. ఆ తర్వాత అతని ఇంట్లో ఒక ల్యాప్ టాప్ సహా ఏటీఎం కార్డులు, రెండు సెల్ ఫోన్లు, డబ్బులు తీసుకొని దుండగులు పరారయ్యారు. కాసేపటికి స్నేహితుడు వచ్చాక జరిగింది తెలుసుకొని విస్తుపోయాడు. వెంటనే స్నేహితుడి కట్లు విప్పి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నేరుగా చందానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీఐ, ఎస్‌ఐ క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే, ఈ ఘటన గురించి పోలీసులు శ్రీహర్షను ప్రశ్నించగా.. తనను కట్టేసి బెదిరించారని, ‘‘చస్తావని వదిలేస్తున్నాం. మా అన్న జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయి’’ అని దుండగులు హెచ్చరించారని చెప్పాడు.
బెదిరించింది వాళ్లేనా?
15 రోజుల క్రితం తమను పలువురు కొట్టారని వీరిద్దరూ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, దాని ఫలితమే ఈ ఘటన అని పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జులై 15న రాత్రి వీరు ఇంటి దగ్గర ఉండగా స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఫూటుగా తాగి, తన స్నేహితుడితో కలిసి కారులో వచ్చి.. అక్కడున్న శ్రీహర్ష, సాయిరాంలను దూషించి, తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్న క్రమంలో తాజా ఘటన చోటు చేసుకుంది. మా అన్న జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించి వెళ్లడాన్ని బట్టి ఆ ఘటనకు సంబంధించి జరిగిన దాడి కచ్చితంగా అయి ఉంటుందని బాధితులు చెప్పారు. తాజా ఘటనపై దోపిడీగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.