DK Aruna: అసెంబ్లీ సెక్రటరీ వద్దకు డీకే అరుణ, ఎమ్మెల్యేగా గుర్తించాలని వినతి
ప్రస్తుత ఎమ్మెల్యే తప్పుడు అఫిడవిట్ సమర్పించారని నిర్ధారణ కావడంతో కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హతా వేటు వేసి.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే.
తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ స్పీకర్ అందుబాటులో లేకపోవడం వల్ల అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ఇటీవల గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ గద్వాల నియోజకవర్గంలో రెండో స్థానంలో ఉన్న తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఆమె వినతి పత్రం ఇచ్చారు. అంతేకాక, తెలంగాణ హైకోర్టు తీర్పు కాపీని కూడా అందించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చారు.
కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని నిర్ధారణ కావడంతో కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హతా వేటు వేసి.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. ఇందులో యాభై వేల రూపాయలు డీకే అరుణకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
కొద్ది నెలల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యేపైనా ఇలాగే అనర్హతా వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమాతో పోటీలో ఓడిపోయిన జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ప్రకటించారు. కానీ సుప్రీంకోర్టు స్టే వల్ల ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.
2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ దాదాపుగా 28 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అనర్హతా వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూ ఉండగానే ఆమె పార్టీ మారిపోయారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు.
హైకోర్టు తీర్పును అమలు చేస్తే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. అయితే ఎమ్మెల్యే పదవి కాలం దాదాపుగా ముగిసిపోయే దశకు వచ్చింది. మళ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ .. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులోనూ.. కృష్ణమోహన్ రెడ్డి అభ్యర్థిగా చోటు దక్కించుకున్నారు.