Kavitha : తీన్మార్ మల్లన్నతో వివాదం- కవిత ఏకాకి - మద్దతుగా రాని బీఆర్ఎస్ - మరింత దూరం ?
BRS and Kavitha: బీఆర్ఎస్, కవిత మధ్య మరింత దూరం పెరిగింది. తీన్మార్ మల్లన్న వ్యక్తిత్వాన్ని కించ పరిచినా మద్దతుగా బీఆర్ఎస్ మాట్లాడకపోవడంతో కవిత అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

BRS and Kavitha Politics: కేసీఆర్ కుమార్తె కవిత తనపై కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఅనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ఓ సామెతను అడ్డం పెట్టుకుని తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా మాట్లాడారని మండిపడుతున్నారు. ఆమె అనుచరులు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేయడం, అక్కడ ఆయన గన్ మెన్ కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంలో కవితకు సొంత పార్టీ నుంచి మద్దతు లభించడం లేదు.
కవితకు బీఆర్ఎస్ నుంచి లభించని సపోర్ట్
కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుమార్తె.. ఆమెకు కష్టం వస్తే బీఆర్ఎస్ లో తీవ్ర స్పందన రావాలి. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా అయినా బీఆర్ఎస్ నేతలు, కుటుంబసభ్యులు కవితకు ముందుకు వస్తారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంోల ఎవరూ స్పందించలేదు. బీఆర్ఎస్ మీడియాలోనూ ప్రాధాన్యత లభించలేదు. ఆమె డీజీపీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేసినా.. శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదు. ఎవరో ఒకరిద్దరు నేతలు మొక్కుబడిగా స్పందించారు కానీ.. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచితమైన వ్యాఖ్యల విషయంలో అలాంటి సపోర్టు కవితకు లభించలేదు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యుల ఆమె వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా ఉన్నాయని.. ఇంటి ఆడపడుచుపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఆమెకు మద్దతుగా ఉండకపోవడం ఏమిటన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
బీఆర్ఎస్ లో ఉన్నా సొంత రాజకీయాలు చేస్తున్న కవిత
కవిత రాజకీయంగా కేటీఆర్ తో సఖ్యతగా లేరు. ఇటీవల కొన్ని ఇంటర్యూల్లో కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించబోనని చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తనది కూడా అని ఆ కవిత బుతున్నారు. పార్టీ వ్యవహారాల్లో సరైన పాత్ర లేదని జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ బహిరంగంగా ఎప్పుడూ ఆమె బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయలేదు. కేసీఆర్ తమ నాయకుడు అనే అంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. కానీ ఆమె ప్రత్యేకమైన దారిలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడంతో ఆమెను దూరం పెట్టారు.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కవిత ఆవేదన
తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా ఘోరంగా ఉన్నాయని కవిత అనుచరులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాడే సామెతల్ని తీసుకువచ్చి రాజకీయాల్లో అన్వయిస్తే ఘోరమైన అర్థాలు వస్తాయని అంటున్నారు. అయితే తన మాటల్ని తీన్మార్ మల్లన్న సమర్థించుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు మరింతగా పెరుగుతుంది. కవిత ఒంటరి పోరాటం చేస్తున్నారు. కవిత సొంత రాజకీయాలు చేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక తనకు ఎలాంటి మద్దతు రాదు అని ఒంటరి పోరాటం చేయాల్సిందేనని ఫిక్సయి ఉంటే ప్రస్తుత పరిణామాలపై ఆమె పెద్దగా ఆశ్చర్యపోరు. కానీ వ్యక్తిగత దాడి జరిగినప్పుడు కూడా కుటుంబసభ్యులు మద్దతు తెలియచేయలేదని కవిత ఫీల్ అయితే కుటుంబ బంధాల మధ్య కూడా దూరం పెరుగుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.





















