Telangana Ministers: తెలంగాణ మంత్రుల మధ్య ముదురుతోన్న వివాదాలు.. స్థానిక ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుందా?
Telangana Local Body Elections | మేడారం ఆలయ అభివృద్ధి పనుల విషయంలో PCC చీఫ్ కు నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు అని, సమస్య పరిష్కరించాలని కోరినట్లు మంత్రి సీతక్క తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలో పలువురు మంత్రుల మధ్య వివాదం కొనసాగుతోందని తెలిసిందే. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తనను అవమానించేలా మాట్లాడారని, క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. వివాదం పెద్దది అవకూడదని భావించి మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో అంతా సర్దుకున్నట్లే అనిపించింది. కానీ ఇదే వివాదంలో మంత్రి వివేక్ వెంకటస్వామిపై అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం సద్దుమణగలేదు. కులం ఆధారంగా కొందరు తనపై కుట్రచేస్తున్నారని వివేక్ ఆవేదన వ్యక్తంచేశారు.
అడ్లూరి లక్ష్మణ్ పై వివేక్ విమర్శలు..
నిజామాబాద్‌లో జరిగిన మాలల ఐక్య సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత నామీద ఉంది. పార్టీ గెలిస్తే కాంగ్రెస్ లో నాకు మంచి పేరు వస్తుందని కొందరు కులం కార్డుతో కుట్రలు చేస్తున్నారు. ఆ సమావేశంలో నేను ఎవరినీ ఏమీ అనలేదు. కానీ విషయంపై వివేక్ స్పందించలేదని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. నేను మీటింగ్ లో నా ఫోన్ చూసుకుంటున్న. ఎవరినీ కించ పరచలేదు. ఆ తరువాత మరో మీటింగ్ జరిగితే అడ్లూరి లక్ష్మణ్ పక్కనే కూర్చొన్నాను. కానీ తాను మాదిగ అని అంటూ మాలలు తనను తక్కువ చేస్తున్నారనేలా మాట్లాడటం సరికాదు.
అడ్లూరి లక్ష్మణ్ ను ప్రోత్సహించింది మా నాన్న వెంకటస్వామి (కాకా). నా తండ్రి వెంకటస్వామి జయంతి కార్యక్రమం కార్డులో అడ్లూరి లక్ష్మణ్ పేరు లేదని విమర్శించాడు. కానీ మంత్రి శ్రీధర్ బాబు తండ్రి జయంతి కార్యక్రమం కార్డులోనూ ఎవరి పేరు వేయలేదు. కొందరూ అడ్లూరి లక్ష్మణ్‌కు విషం ఎక్కిస్తు్న్నారు. దాంతో నాకు సంబంధం లేకున్నా వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని’ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిపై తనకు వ్యామోహం లేదని, దళితుల కోసం పోరాటం చేస్తున్న తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అడ్లూరి లక్ష్మణ్..
నిజామాబాద్‌లో మాల సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో సహచర మంత్రి వివేక్ తన గురించి మాట్లాడటం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. జయంతి కార్యక్రమాల్లో పేరు లేదని నేనెక్కడా మాట్లాడకపోయినా వివేక్ ఆ విషయాన్ని తనకు ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. వివేక్ తండ్రి వెంకటస్వామి జయంతి వేడుకలు ధర్మపురిలో నిర్వహించిన తరువాతే నేను హైదరాబాద్ బయలుదేరాను. నా శాఖ కార్యక్రమానికి వచ్చి.. వస్తాడా రాడా..వెళ్లిపొమ్మంటారా అని మాట్లాడటం సరికాదు. మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను జంతువుతో పోల్చి మాట్లాడతే కనీసం ఖండించలేదని బాధతో అడిగాను.
మరుసటి రోజు వివేక్ వ్యక్తిగతంగా ఫోన్ కాల్ చేస్తాడని భావించా. కానీ అలా జరగలేదు. నేడు నిజామాబాద్‌లో వ్యక్తిగతంగా నా పేరు తీయడం, నాపై విమర్శలు చేయడాన్ని వివేక్ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను కాంగ్రెస్ నేతను. ఏమైనా సమస్య వస్తే రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నవారు కూర్చుని మాట్లాడుకోవాలి. ఇలా టార్గెట్ చేసి కామెంట్స్ చేయడం బాధాకరం. తోటి మంత్రి దళితుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించకపోగా.. అడిగినందుకు నన్ను తప్పు పడుతున్నారు. ఏం జరిగినా సరే.. నేను పార్టీ గీత దాటే వ్యక్తిని కాదని’ అడ్లూరి స్పష్టం చేశారు.
PCC చీఫ్ కు ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు - మంత్రి సీతక్క
సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. మీడియాలో వచ్చిన వార్తలను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్ళానని మంత్రి సీతక్క తెలిపారు. వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని పీసీసీ చీఫ్ ను కోరానన్నారు. ఆదివాసి వీర వనితలు సమ్మక్క సారలమ్మ ఆలయం అభివృద్ధి పనుల చుట్టూ ఏ చిన్న పాటి వివాదం ఉండకూడదన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా పిసిసి చీఫ్ దృష్టికి మీడియాలో వచ్చిన వార్తలను తీసుకెళ్లాను.
సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యమైనవి. వాటి చుట్టూ ఎలాంటి అపార్థాలు లేకుండా, పనులు సజావుగా పూర్తి కావాలి. సున్నితమైన అంశం కావడంతో, వీలైనంత త్వరగా అపార్థాలు తొలగిపోయి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగేలా చూడమని కోరాను. అంతే తప్ప నేను ఎవరి మీద పిసిసి చీఫ్ కు ఫిర్యాదు చేయలేదు. మేడారం ఆలయం అభివృద్ధి మన అందరి బాధ్యత. పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.
పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ..
తన శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం ఏంటని మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేడారం పనుల టెండర్లను తన అనుచరుడికి పొంగులేటి ఇప్పించే ప్రయత్నం చేయడం వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఏడు కోట్ల విలువైన టెండర్లకు సంబంధించి తన ప్రమేయం లేకుండా పొంగులేటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కొండా సురేఖ సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. ఇది తనకు అప్పగించిన మేడారం ఆలయం పనులు కనుక, సమస్య నిజమైతే వారితో మాట్లాడి పరిష్కరించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి సీతక్క తీసుకెళ్లారు. తమపై సీతక్క కంప్లైంట్ చేశారని సహచర మంత్రులు అనే వరకు విషయం వెళ్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ మాత్రం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు తలనొప్పిగా మారుతోంది.






















