Bhatti Vikramarka: నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ - త్వరలో మరో డీఎస్సీ నిర్వహిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి, పరీక్షల వాయిదాపై కీలక వ్యాఖ్యలు
Telangana News: నిరుద్యోగుల సమస్యలు.. పోటీ పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. అన్నిసార్లు పరీక్షల వాయిదా సరి కాదని అన్నారు.
Deputy CM Bhatti Comments On Job Notifications: తెలంగాణలో ఇదేం చివరి డీఎస్సీ కాదని.. 6 వేల పోస్టులతో త్వరలో మరో డీఎస్సీ ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై ఆయన స్పందించారు. నిరుద్యోగ యువతపైనే దృష్టి కేంద్రీకరించామన్న ఆయన.. 3 నెలల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని చెప్పారు. మిగిలిన ఉద్యోగాలు సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అటు, పరీక్షల వాయిదా వేయాలన్న డిమాండ్లపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కల్పన కోసమని.. అన్నిసార్లు పరీక్షలు వాయిదా వేయడం సరికాదని అన్నారు. నిరుద్యోగులకు త్వరగా ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంతో చర్యలు చేపట్టామని.. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని స్పష్టం చేశారు.
'మరిన్ని డీఎస్సీలు'
'కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాం. రాష్ట్రంలో 16 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు గుర్తించాం. 11 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చాం. 34 వేల మందిని బదిలీ చేశాం. ఈ నెల 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచాం. జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకూ పరీక్షలు నిర్వహిస్తున్నాం. కొన్ని నెలలుగా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కొందరు ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని ధర్నాలు చేస్తున్నారు. పదేళ్లలో ఎన్నడూ గ్రూప్ - 1 నిర్వహించలేదు. గ్రూప్ - 2 ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేశారు. పరీక్షలు అన్నిసార్లు వాయిదా వేయడం సరికాదు. నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం. హాస్టల్ వెల్ఫేర్‌కు సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాం. మరిన్ని డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. దాదాపు 5 వేల నుంచి 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ త్వరలోనే ఉంటుంది.' అని భట్టి తెలిపారు.
అటు, సీఎం రేవంత్ రెడ్డి సైతం శనివారం ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. పదేళ్లుగా ఉద్యోగాల భర్తీ సరిగ్గా జరగలేదని.. ఇప్పుడు పకడ్బందీగా నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగులను కావాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు వాయిదా కోసం పరితపిస్తున్నాయని అన్నారు. ఏ పరీక్ష రాయలేనోడు పరీక్షలు వాయిదా వేయాలని దీక్ష చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు పూర్తైతే ఉద్యోగం రాని వారు వేరే జాబ్ చూసుకుంటారని అన్నారు. వచ్చే అసెంబ్లీలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం స్పష్టం చేశారు. క్యాలెండర్‌కు చట్టబద్ధత ఉంటుందని.. ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షల మాదిరిగానే రాష్ట్రంలోనూ ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు.
పోలీసుల నిఘాలో..
అటు, గ్రూప్ - 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తోన్న ఆందోళనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగులు శనివారం రాత్రి ఆందోళనకు పిలుపునిచ్చారు. అశోక్ నగర్‌లోని కేంద్ర గ్రంథాలయం నుంచి నిరుద్యోగులు చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా అశోక్ నగర్ క్రాస్ రోడ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం చిక్కడపల్లిలోని గ్రంథాలయం పరిసరాల్లో పోలీసులు పహారా కాశారు. అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.