Lokmanya Tilak Express : కరీంనగర్ కు లోకమాన్య తిలక్ రైలు పునరుద్ధరణ, రైల్వేశాఖ మంత్రికి ఎంపీ అర్వింద్ రిక్వెస్ట్
Lokmanya Tilak Express : కరీంనగర్ నుంచి ముంబయికి లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలును పునరుద్ధరించాలని ఎంపీ అర్వింద్ రైల్వేశాఖ మంత్రిని కోరారు. కోవిడ్ సమయంలో ఈ రైలును రద్దు చేశారు.
Lokmanya Tilak Express : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను దిల్లీలోని ఆయన కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న పలు రైల్వే సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా వారానికొకసారి కరీంనగర్ నుంచి ముంబయి వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ ను కోవిడ్ సమయంలో రద్దుచేశారు. కానీ ఇప్పటి వరకూ పునరుద్ధరణ చేయలేదని ఎంపీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధి నుండి చాలా మంది వలస కార్మికులు ముంబయి వెళ్తారని, రైలు రద్దు కారణంగా చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన మంత్రికి వివరించారు. వెంటనే ఈ రైలును పునరుద్ధరణ చేయాలని, అంతేకాకుండా వారానికోసారి నడిచే బదులు రోజువారీగా గానీ లేదా వారానికి మూడు సార్లు నడిచే విధంగా గానీ చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు. ఈ సమస్యను సావధానంగా విన్న మంత్రి లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలును వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.